విద్యార్ధుల జీవితాల్లో ఉపాధ్యాయుల‌కు గొప్ప స్థానం 

సినిమాలు వ‌దిలి పుస్త‌కాలు చ‌ద‌వాలి

చిల‌క‌లూరిపేట‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌



 

చిల‌క‌లూరిపేట‌న్యూస్‌: 

ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని.. దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని  రాష్ట్ర  ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.  ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని శ్రీ‌శార‌దా జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శుక్ర‌వారం   నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.O  కార్యక్రమంలో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రోడ్డు మార్గాన  చిల‌క‌లూరిపేట‌కు చేరుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నేరుగా పాఠ‌శాలలోకి ప్ర‌వేశించారు. సందర్భంగా పోలీసులు ఉప ముఖ్యమంత్రికి గౌరవ వందనాన్ని చేయగా దాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోకి నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరు భవిష్యత్తును తీర్చిదిద్దుతారు..



ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందని అన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమన్నారు.పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారని,  తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని వివ‌రించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరు భవిష్యత్తును తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు.విద్యార్థులు ఉదయించే సూర్యులని.. భవిష్యత్తు మీదేనని డిప్యూటీ సీఎం అన్నారు. జెన్ జీ తరం అనేది చాలా కీలకమన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, అధికారికి వారి భవిష్యత్తుపై ధ్యాస ఉండాలన్నారు. లక్ష మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుందన్నారు. 

పుస్త‌కాల‌ను చ‌ద‌వాలి... 



యూదులు పట్టుమని పది మంది ఉన్నా వెయ్యి మందికున్న శక్తి వారికి ఉంటుందన్నారు. మనం లక్షమంది ఉన్నా పోటీ ప్రపంచంలో నిలవలేమన్నారు. అబ్దుల్ కలాం రామనాథపురం నుంచి వచ్చి మిస్సైల్ మ్యాన్ అయ్యారన్నారు. తమిళ మాధ్యమంలో చదివిన కలాం ఎన్నో విజయాలను సాధించడం ద్వారా చదివే మాధ్యమం ముఖ్యం కాదని నిరూపించారని వివరించారు. మీకు బలం తప్పనిసరిగా ఉండాలన్నారు. మానసిక బలం కోసం పుస్తకాలు చదవాలన్నారు. మార్కులు వస్తాయని చదవొద్దన్నారు. గుంటూరు శేషంద్ర‌శ‌ర్మ క‌వి ర‌చించిన పుస్త‌కం విద్యార్ధుల భావి జీవితానికి అండ‌గా ఉంటుంద‌ని భావించి, దాన్ని పునఃముద్రించిన‌ట్లు వెల్ల‌డించారు. తన పాఠశాల విద్య సమయంలో తమ ఉపాధ్యాయులు చరిత్ర పాఠం చెబితే నా గుండెల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ టీచర్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పిన కథనే తనను ఈ స్థాయికి తెచ్చిందన్నారు. ఉపాధ్యాయులు భవిష్యత్తు కోసం విద్యార్థులను తయారు చేయాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభావితం చేస్తారన్నారు. మన జీవితాలను బాగు చేసేవారికి ఎలా విధేయతతో ఉండాలనేది తన తల్లి నుంచి నేర్చుకున్నానని డిప్యూటీ సీఎం వివ‌రించారు. హ‌ర్యానా రాష్ట్రం నుంచి తెలుగు భాష నేర్చుకొని పల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా బాగా మాట్లాడుతున్నార‌ని ప్ర‌శంసించారు.  

సినిమాల‌కు దూరంగా ఉండాలి.. 



పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులు, వినోదం పంచే సినిమాకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు.  సినిమాలు కేవలం వినోదం కోసమే. వాటిని చూసి యువత, విద్యార్థులు చెడిపోవద్దు. ఒక నటుడిగా ఈ మాట నేనే స్వయంగా చెబుతున్నా. మనం ఎప్పుడూ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతగా ఉంటూ వారిని ఆదర్శంగా తీసుకోవాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  అబ్దుల్ కాలం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో మనం కూడా ఏదైనా అయ్యి సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థుల వ్యక్తిత్వం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు.

విద్యార్ధుల‌కు ప్ర‌శంస‌లు.... పాఠ‌శాల‌కు వ‌రాలు.. 



పాఠశాల మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గౌసియాను డిప్యూటీ సీఎం అభినందించారు. చిలకలూరిపేటలో గౌసియా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఆడపిల్లలకు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు జుబేదా, రిహానలు ఫిజిక్స్ కు సంబంధించిన ఫైర్ అలారమ్, డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి గురించి బాగా వివరించారన్నారు. వారిలోని నిగూఢంగా ఉన్న శక్తిని వెలికి తీస్తే దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అధ్యాపకులకు చెప్పాలన్నారు. ఆడపిల్లలను తీర్చిదిద్దగలిగితే వారిలో అద్భుతమైన శక్తి ఉంటుందనే తెలుస్తుందన్నారు. రెస్పరెటరీ సిస్టం గురించి పదో తరగతి విద్యార్థిని నయోమి బాగా వివరించిందన్నారు. శ్రుతి కుట్లు, అల్లికల గురించి, రత్నకుమార్ ఆర్ట్స్ అండ్ స్కిల్ గురించి బాగా చెప్పారన్నారు. జాతీయ విద్యా విధానంలో విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్య గురించి తాను చాలా ప్రతిపాదనలు చేశామన్నారు.శ్రీ శారద పాఠశాలకు కావాల్సిన మైదానం విషయమై కూడా స్థలం కేటాయింపు కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. లైబ్రరీని సొంతగా మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాంధారి సింగ్ లాంటి కవి హిందీ పుస్తకాలు పంపిస్తామన్నారు. లైబ్రరీ నిండిపోయేన్ని పుస్తకాలతో పాటు బీర్వాలు పంపిస్తామని హామీనిచ్చారు. 25 కంప్యూటర్లు సొంత ఖర్చుతో ఇస్తామన్నారు.

గంజాయిపై ప‌వ‌న్ ఫైర్‌..  

మాదక ద్రవ్యాల వినియోగం అంశంపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు, తల్లిదండ్రులు మాదకద్రవ్యా బానిసలను గుర్తించి వారిని ఆ మత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలని సూచించారు. పంజాబ్ తో పాటు చాలా రాష్ట్రాల్లో యువత గంజాయి పెద్ద విషయం కాదన్నట్లుగా మాట్లాడడం తనకు భయం కలిగిస్తోందన్నారు. అది మధ్య తరగతి వారి జీవితాల్లోకి వస్తే సమాజం విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా చర్చించి దాన్ని నిర్మూలించేందుకు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశ సంపద కలల ఖనిజాలతో చేసిన యువతని గుర్తు చేసుకున్నారు. ఏం చేసినా కూడా అవి ఏవో ఒక రోజు కనుమరుగై పోతాయన్నారు. పోగొట్టుకోలేని నిజమైన సంపద జ్ఞానం అని అన్నారు. పిల్లలకు స్వయం శక్తి పై నిలబడే ఆలోచన విధానాన్ని అలవరచాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు.

 ప‌వ‌న్‌తో హిట్ సినిమా తీసేవాడిని... ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు

తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావుతో క‌ల‌సి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌సి ప‌వ‌న్‌తో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని, అందుకు ప‌వ‌న్ కూడా సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని గుర్తు చేశారు. అయితే తాను రాజ‌కీయాల్లో ఆ క‌ల నెర‌వేర‌లేద‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిల‌క‌లూరిపేట‌కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మైల‌వ‌ర‌పు కృష్ణ‌తేజ చిల‌క‌లూరిపేట‌కు చెందిన  వ్య‌క్తి అని, వారి తాతాగారి హాయాంలో అనేక వంద‌ల ఎక‌రాల భూమి ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం దానం చేశార‌ని వివ‌రించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుడి భుజంలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరించి, విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. 

కార్య‌క్ర‌మంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్‌, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ పి రంజిత్‌భాష‌, ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మైల‌వ‌ర‌పు కృష్ణ‌తేజ, జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ హెన్నాక్రిస్టినా  త‌దిత‌రులు పాల్గొన్నారు.

----------------------

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: