స‌రైన స‌మ‌యంలో, స‌రైన రీతిలో నిర్ణ‌యం తీసుకోక‌పోతే ప‌రిస్థితులు మ‌రోలా ఉండేవి. మంచి చేయాల‌న్న సంక‌ల్పం, విపత్క‌ర ప‌రిస్థితుల్లో, తీవ్ర‌మైన ఒత్త‌డిలో  కేర‌ళ వ‌ర‌ద‌ల స‌మయంలో జిల్లా క‌లెక్ట‌ర్ స్థాయిలో  తీసుకున్న నిర్ణ‌యం వేలాది మందిని కాపాడింది. ఎందోరికో పున‌ర్జ‌న‌మ్మ ఇచ్చిన వ్య‌క్తి   చిల‌క‌లూరిపేట కుర్రాడు కృష్ణ‌తేజ‌ కావ‌టం చిల‌క‌లూరిపేట‌కే గ‌ర్వ‌కార‌ణం ..

    ఒక్క రోజులో రెండు లక్షల మంది జనాభాను తరలించాలి! అదీ.. పడవల్లో, పైగా.. జనానికి ఇష్టం లేకుండా! సాధ్యమేనా?

    మునుపెన్నడూ ఇంత భారీ ఎత్తున ప్రజల్ని జలమార్గంలో తరలించిన దాఖలాలూ లేవు! అయినా సాధ్యం చేసి తీరాలి. బలవంతంగానైనా సరే తరలించి తీరాలి! ఎందుకంటే అంత మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది కాబట్టి.

    కేరళలో ఒక యువ ఐఏఎస్‌ అధికారి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుని 2లక్షల మంది ప్రాణాలను కాపాడారు. ఆయనే మన తెలుగుతేజం కృష్ణతేజ. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణతేజ సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రకృతి విపత్తు నిర్వహణలో ఒక పాఠంగా నిలిచిపోనుంది.

    ప్రకృతి విపత్తును ఎదుర్కోవాలంటే వనరులు ఎంత ముఖ్యమో వ్యూహమూ అంతే ముఖ్యం. కేరళను అతలాకుతలం చేసిన వరద నుంచి 14 గ్రామాలను రక్షించడానికి కృష్ణతేజ ‘ఆపరేషన్‌ కుట్టనాడ్‌’ అనే వ్యూహాన్ని అమలు చేశారు.


ఏమిటీ ఆపరేషన్‌ కుట్టనాడ్‌?

ఈ నెల 16న రాత్రి 10 గంటలకు కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ఐజాక్‌తో కలిసి అలిప్పి జిల్లా సబ్‌కలెక్టర్‌ కృష్ణతేజ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పక్క జిల్లా శబరిమలైలో డ్యామ్‌ నీటిమట్టం ఒకటిన్నర మీటర్లు పెరిగిందని అప్పుడే సమాచారం అందింది. అక్కడ ఒకటిన్నర మీటర్ల ఎత్తు నీటిమట్టం పెరిగిందంటే అలిప్పి జిల్లా కుట్టనాడ్‌లో ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఎందుకంటే కుట్టనాడ్‌ సముద్రమట్టానికంటే రెండు మీటర్ల దిగువన ఉంటుంది. దాదాపు 24 గంటల నుంచి 48 గంటల్లోపల ఆ ప్రాంతం మొత్తం మునిగిపోనుందని అధికారులు అంచనాకు వచ్చారు. కుట్టనాడ్‌ పరిధిలోని 14 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2లక్షల నుంచి 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన తరలించాలనే నిర్ణయానికొచ్చారు. జలమార్గమే తప్ప రోడ్డు మార్గం లేని ఆ గ్రామాల నుంచి అంత పెద్ద సంఖ్యలో జనాభాను తరలించడం అసాధ్యమని కొందరు అధికారులు కొట్టిపడేశారు. కానీ కృష్ణతేజ రాజీపడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించాల్సిందేననే మొండి నిర్ణయానికొచ్చారు. వెంటనే అధికారులతో చర్చలు ప్రారంభించి మర్నాడు (17న) తెల్లారి 5 గంటలకల్లా ప్రణాళికను సిద్ధం చేశారు. వెంటనే ప్రారంభమైన ‘ఆపరేషన్‌ కుట్టనాడ్‌’ రెండు రోజులు నిరంతరాయంగా కొనసాగింది. 18న రాత్రి వరకూ 14 గ్రామాల్లోని 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 19, 20 తేదీల్లో అక్కడి పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి మానవీయత చాటుకున్నారు.

ఎలా సాధ్యమైంది?

* 16న అర్థరాత్రే పడవలెన్ని ఉన్నాయి? వాటి యజమానులెవరు? అవసరమైన ఇంధనం అందుబాటులో ఉందా? తదితర సమాచారాన్ని సేకరించారు.

* పడవ యజమానులను ఒకచోటికి చేర్చే బాధ్యతను కొందరు అధికారులకు, ఇంధనం సహా ఇతర అవసరాలను సమకూర్చే బాధ్యతలను మరికొందరికి అప్పగించారు.

* దూరంగా ఉండి త్వరగా మునిగిపోయే ప్రమాదమున్న ప్రాంతాలకు పెద్ద పడవలను, త్వరగా చేరుకోగలిగే ప్రాంతాలకు చిన్న పడవలను పంపించేలా కార్యాచరణ రూపొందించారు.

* దగ్గరుండా స్థానికులను పంపించడానికి ప్రతి గ్రామానికి ఒక పోలీసును పంపించారు.

తొలుత ప్రతిఘటన

వరద ముంచుకొస్తున్న దాఖలాలే లేనప్పుడు సొంత ఇంటిని వదిలి వెళ్లడమేమిటని స్థానికులు ససేమిరా అన్నారు. దీంతో బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకు తరలించాలని కృష్ణతేజ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకించారు. కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా విమర్శించినా ఆయన వెనక్కు తగ్గలేదు. స్థానికంగా కొంత మంది పంచాయతీ అధ్యక్షులకు నచ్చజెప్పారు. వారితో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించారు. మొత్తానికి 48 గంటల కఠోరశ్రమ, కఠిన నిర్ణయాలతో 2.5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. తరలింపు మొదలుపెట్టిన 24 గంటల్లోపే ఆ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. రెండంతస్తుల భవనాలు కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో అప్పటి వరకూ విమర్శించినవారే కృష్ణ తేజను అభినందనలతో ముంచెత్తారు.

స్వయంగా సహాయక చర్యల్లో

కార్యాచరణ ప్రారంభమైన దగ్గర నుంచి ఆపరేషన్‌ కుట్టనాడ్‌ పూర్తయ్యే వరకూ ప్రతి పనినీ కృష్ణతేజ స్వయంగా పర్యవేక్షించారు. ఉన్నతాధికారే వరద నీటిలో నిలబడి సూచనలిస్తుండడంతో మిగిలిన యంత్రాంగం, పడవ యజమానులు, ఇతర స్వచ్ఛంద సేవకులూ శ్రమించారు. కృష్ణతేజ పర్యవేక్షణలో 700 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. నాణ్యమైన భోజనం అందించేందుకు శిబిరాల్లో తానూ భోంచేయడంతో పాటు సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులూ అక్కడే తప్పనిసరిగా భోజనం చేయాలని ఆదేశించారు. కృష్ణతేజ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని, కార్యాచరణను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభినందించారు. అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల సంఘం ప్రశంసించింది.

                                                 -ఈనాడు సౌజ‌న్యంతో





Next
Newer Post
Previous
This is the last post.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: