రానున్న రోజుల్లో చిలకలూరిపేట నియోజకవర్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుందా.. అంటే అవుననే చెప్పాలి. వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యడ్లపాడు మండలం కొండవీడును అభివృద్ధి చేయటానికి, 700 సంవత్సరాల నాటి కొండవీడు రెడ్డిరాజుల పాలన, నిర్మాణాల ప్రాశస్థ్యాన్ని ప్రజలకు తెలియజేసేలా కొండవీడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకొని ఫిబ్రవరి 9, 10 తేదీల్లో కొండవీడు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఘాట్ రోడ్డు పనులు, ఇతర పనులు ఈ లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ఘాట్‌రోడ్డును మరో 660 మీటర్లు విస్తరించి చారిత్రక కట్టడాల వద్ద కు చేరుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. . కొండపైన 75.9 హెక్టార్లలో విస్తరించి ఉన్న చారిత్రక కట్టడాలను తిలకించేందుకు 5 కి.మీ దూరం నడకదారి నిర్మిస్తున్నారు. దేవాలయాల పునర్మిర్మాణ పనులు కొనసాగుతున్నాయి . గొలుసుకట్టు చెరువులను అభివృద్ది చేయడంతో పాటు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. . చిల్డ్రన్ పార్కు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. పర్యావరణహితంగా బ్యాటరీలతో నడిచే కార్లను అనుమతించనున్నారు. .
ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట అందుబాటులోకి రానుంది.



Post A Comment:
0 comments: