రైతుల జీవితాల్లో వ్యవసాయం ఎలా ముడి పడిఉందో... వ్యవసాయానికి జీవాధారమైన పాడి పశువులు కూడా వారి జీవితాల్లో భాగస్వాములౌతాయి. ఒక సంక్రాంతి పండుగ వేళ రైతుల ఇళ్లకు ఫలసాయం తరలిరాగా, మనసు మూలల్లో ఉప్పొంగే సంతోషాల వెల్లువను సాగులో సహాయపడే పశుసంపదకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ ఆటపాటల్లో పశువులూ పాత్రధారులవుతాయి. ఇదే క్రమంలోనే ఎద్దుల పోటీలు రైతుల్లో ఉత్సహాన్ని నింపుతాయి. చిలకలూరిపేటలో గతం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతునే ఉంది. ఆరుగాలం కష్టపడి పనిచేస్తూ పంటలు పండించే రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎద్దుల పందాలు ఒక ఆటవిడుపు. ఈ పందాలను తిలకించటానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది రైతులు పోటీలు జరిగే ప్రాంతాలకు వస్తుంటారు.
రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రపౌండేషన్, మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సౌజ్యన్యంతో ఈ నెల 18 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. పార్టీ అధినేత స్వర్గీయ ఎన్‌టీఆర్ జయంతి సందర్బంగా నిర్వహించే ఈ పోటీలు గతంలో మూడు రోజులు మాత్రమే కొనసాగాయి. ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీలు రైతులు, పశుపోషకుల ఆదరణతో ఆరు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ పోటీలలో ఒక్క ఒంగోలు జాతీ ఎడ్ల పందాలే కాక పోటేళ్ల పందాలు, గోమాతల అందాల పోటీలు నిర్వహించనున్నారు. పాత పశువుల సంత ప్రాంగణంలో నిర్వహించే పోటీలకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పందాలకు హాజరుకానున్నారు.
. ఒకప్పుడు ఒంగోలు జాతి ఎద్దులు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అవి క్షీణించే దశలో ఉన్నాయి. ఆ జాతిని కాపాడుకోవడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రకాశం జిల్లాలో ఇంటికో జత కనబడేది. నేడు గ్రామానికి ఒక జత ఉండటమూ కూడా కష్టమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు. ఈ క్రీడలకు ఉపయోగించే ఎద్దులను సామాన్య రైతు సాకలేకపోతున్నాడు. వీటిని కేవలం ధనికులు, భూస్వాములు మాత్రమే పోషించగలుగుతున్నారు
ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శనలో పాల్గొనే ఎద్దుల జతలను పోషించడం అంటే ఆషామాషీ కాదు. కేవలం ధనికులు, భూస్వాములు మాత్రమే సాకగలరంటే వాటికి పెట్టే ఆహారం ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఇట్టే అర్థమవుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు కేజీల ఉలవలను ఉడకబెట్టి, వాటిని రోట్లో బెల్లంవేసి దంచి పెడతారు. విత్తనాలు తీసిన ఎండు ఖర్జూరాలను రోజూ కేజీ లేదా అరకేజీ పెడతారు. ఎద్దుకు వేడి చేయకుండా చలవకోసం కేజీ పిండితో తయారైన రాగిజావను లేదా బార్లీ జావను మధ్యాహ్నాం ఇస్తారు. అప్పుడప్పుడు నల్లద్రాక్ష పెడతారు. డాక్టర్ సలహా మేర బలానికి, అరుగుదలకు సంబంధించిన ఇంజెక్షన్లు వేయిస్తారు. అలాగే ఎండుచొప్ప, పచ్చిగడ్డిని కూడా వాటికి మేతగా పెడుతుంటారు. రెండు, మూడురోజులకొకసారి జొన్న అన్నం పెడతారు. క్యారెట్, బీట్‌రూట్‌ను రోజుకు కేజీలెక్కన గ్రైండ్ చేసిి పెడతారు. కొందరు రైతులైతే వారికి ఎద్దుమీద ఉన్న మక్కువతో రోజుకు రెండు, మూడు అరటిపండ్లు కూడా పెడతారు. ఒక ఎద్దుల జతను సాకటానికి రైతుకు రోజుకు వెయ్యి రూపాయలపైనే ఖర్చవుతుంది. దీంతోపాటు జత ఎడ్లకు ముగ్గురు జీతగాళ్లు ఉంటారు. ప్రధాన శిక్షకునికి నెలకు సుమారు లక్ష రూపాయల వరకూ జీతం ఉంటుంది. అతనికి సహాయకులుగా ఉన్న ఇద్దరికి ఒక్కొక్కరికి డెబ్భై వేల లెక్కన జీతాలుంటాయి. వర్షాకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు వీటిని సాకాలని ఆసక్తి ఉన్నా ఆరు పళ్ల వయసు వచ్చేసరికి పోషించే శక్తిలేక ధనికులకు అమ్ముకుంటున్నారు.
ఎడ్లలో సైజుల వారీగా పోటీలు పెడతారు. ఒకటిన్నర సంవత్సరం ఉన్న ఎద్దులను పాల పళ్ల ఎడ్లు అంటారు. మనుషుల మాదిరిగా వాటికి మొదట్లో పళ్లు ఊడిపోతాయి. తర్వాత సంవత్సరంలో రెండుపళ్లు వస్తాయి. ఏడాదికి రెండు చొప్పున మొత్తంగా ఎనిమిది పళ్లు వస్తాయి. ఎనిమిది పళ్లు వచ్చాయంటే ఎద్దు యవ్వనంలోకి అడుగుపెట్టినట్లు అర్థం. క్రీడా పోటీల మాదిరిగానే సామర్థ్యాన్ని బట్టి సబ్ జూనియర్లు, జూనియర్లు, సీనియర్ల కేటగిరీలను నిర్దేశించి బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. చిలకలూరిపేటలో 18 నుంచి ఎడ్లపందాల సందడి మరో సారి అంబరాన్ని తాకనుంది.




Post A Comment:
0 comments: