పురపాలక సంఘం ఆదాయానికి గుండెకాయలాంటి టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిమయంగా మారిపోతుంది. ఈ విభాగంలో అక్రమాలు రోజుకో తీరున కొత్తపుంతలు తొక్కుతున్నాయి.. భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు నోటీసులతో కాలయాపన చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన అనంతరం ఎవరైనా ఆ అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగేలా భవన యజమానులకు ఆ అధికారులే సలహాలు ఇస్తున్నారు.వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న యజమానులు పురపాలక ఆదాయాన్ని ఎగ్గొంటేందుకు తప్పుడు ప్లాన్లు రూపొందించి, అధికారులకు కొంత ముట్టజెప్పి ఆమోద ముద్ర వేయించుకుంటున్నారు. దండిగా ముడుపులు ముడుతుండటంతో ఎవరు చూస్తారులే అన్న ధీమాతో యజమానులు కోరిన విధంగా ప్లాన్లను అధికారులు ఆమోదిస్తున్నారు.సాధారణ నివాస గృహాలతోపాటు సామూహిక గృహాలు, వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి తీసుకుని సమర్పించిన ప్లాన్లకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎటువంటి పొంతన ఉండటం లేదు.మరోపక ఆన్‌లైను బిల్డింగ్ అనుమతులు ఆలస్యమవుతున్నాయి. దీంతో చేసేదేమి లేక అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చక చక చేపడుతున్నారు. అధికారులు జారీ చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు వెలుస్తున్నాయి. అనుమతులు పొంది అదనపు అంతస్తులతో పాటు పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
నిబంధనలకు పాతర!
ఫీల్డ్ పరిశీలనలు సరిగ్గా నిర్వహించని అధికారులు భవన నిర్మాణాలను నిర్ణీత సమయాల్లో గుర్తించడంలేదు. ఇలా గుర్తిస్తే నిర్మాణాలు ఆన్‌లైన్ సిస్టమ్‌లో దరఖాస్తుకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అన్నది అపుడే తెలుసుకోవచ్చు. ప్లాన్ల మంజూరులో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ భవన యజమానుల అక్రమ నిర్మాణాలకు సహకారమందిస్తున్నారు. భవన యజమానులకు ఆ నిర్మాణాల్లో ఆక్రమిత నిర్మాణానికి, ఎక్స్‌ట్రా ఫ్లోర్ల నిర్మాణానికి ప్రత్యక్ష సహకారమందిస్తున్నారు. ప్లాన్ల మంజూరుకు ప్రధానమైన పోస్టువెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోపే పలు భవనాలు పూర్తయిపోతున్నాయి.
అన్‌లైన్‌లోనూ అడ్డదారులే..
భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు, ముడుపుల దందాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ విభాగంలో అన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. కాగా వీటిల్లోనూ కొందరు అధికారులు, లైసెన్స్ ఇంజినీర్లు కలిసి అక్రమాలకు తెర లేపారు. సరియైన పత్రాలు లేవంటూ దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టు తిప్పుకున్నారు. పురపాలక సంస్థలోనూ కొందరు లైసెన్స్ ఇంజినీర్ల ద్వారా దరఖాస్తులు చేస్తే వారం రోజుల్లోనే అనుమతులు వస్తే. . . ఇతర ఇంజినీర్ల నుంచి దరఖాస్తులు చేస్తే నెలలు తిరిగినా అనుమతులు రావడం లేదన్న విమర్శలున్నాయి.
పట్టణంలో ఇంత పెద్ద సంఖ్యలో అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నా ఇప్పటి వరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్క నోటీసు కూడా ఇవ్వక పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. . అనుమతులు పొందిన నిర్మాణాలను విడిచి మిగతా వాటికి నోటీసులివ్వాల్సిన అధికారుల ఎందుకు ఇవ్వడం లేదో అన్నది బ్రహ్మ రహస్యంగా మా రింది. పట్టణంలో పరిస్థితి ఇలా ఉంటే శివారు ప్రాంతాలలో వెంచర్ల నిర్మిస్తున్న బిల్డర్ల హవా కోనసాగుతోంది. పెద్ద పెద్ద వెంచర్లు అనుమతులు లేకుండా వెలుస్తున్నాయి. దీనిని అధికారులు కూడా ధ్రువీకరించారు.


Post A Comment:
0 comments: