చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మూడు విలీన గ్రామాలు కలిసి 38వార్డులకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. నూతనంగా మున్సిపాలిటి పగ్గాలు చేపట్టిన పాలకులకు మూడు విలీన గ్రామాలైన గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రుల సమస్యలు ఇబ్బందులు పెట్టనున్నాయి. అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు మున్సిపాలిటి విలీనంతో తీరునున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లో కామన్ సమస్య తాగునీటి సమస్యే కావటం విశేషం. కొన్ని చోట్ల వీధి దీపాలు కూడా వెలగపోవడంతో చీకట్లో ఇబ్బంది పడుతున్నారు
మున్సిపాలిటిలో విలీనమైన గ్రామం 15,16వార్డులుగా విస్తరించి ఉంది. ఈ వార్డుల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్దులే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. పసుమర్రు గ్రామానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్యే. తాగునీటి కోసం ఈ గ్రామ ప్రజలు అత్యధిక మంది చిలకలూరిపేట పట్టణం మీదనే ఆధారపడుతున్నారు. ఉదయాన్నే తమ వాహనాల ద్వారా నీటిని పట్టణంనుంచి తీసుకువెళ్లతారు. ఉన్న చెరువు విస్తీర్ణం పెరిగిన జనాభా రిత్యా సరిపోని పరిస్థితి. చెరువును విస్తరించి ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తేగాని సమస్య పరిష్కారం కాని పరిస్థితి. గతంలో ఏర్పాటు చేసిన పైపులైన్లు కూడా శిధిలావస్థకు చేరుకోవటంతో ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో శాశ్వత మంచినీటి పథకం కోసం ప్రణాళికలు సిద్దం చేయాల్సి ఉంటుంది.
ఇటీవల ప్రభుత్వం పసుమర్రు పరిధిలోనే 1500 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇళ్ల నిర్మాణం కొనసాగి లబ్దిదారులు స్థానికంగా స్థిర నివాసం ఏర్పరుచుకుంటే సుమారు 6వేల మంది జనాభా ఈ గ్రామానికి వచ్చి చేరుతున్నారు. భవిష్యత్తులో తాగు నీట సమస్య మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మరోవైపు యద్దనపూడి రోడ్డు ద్వంసమైంది. పసుమర్రులో గ్రామంలో నుండి వెళ్లే ఈ రోడ్డు మరమత్తులు చేయాలంటే ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్అండ్‌బీ అధికారులు పూనుకోవాల్సిందే. ఈ గ్రామంలో డ్రైనేజీ, పారిశుధ్యం మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.
గణపవరంలో వింతపరిస్థితి...
విలీన గ్రామాలలో అతి పెద్ద గ్రామ పంచాయితీ గణపవరం. వేలాది మంది కార్మికులకు నిలయమైన పారిశ్రామిక వాడ. మున్సిపాలిటిలో విలీనం అనంతరం 5వార్డులు ఈ గ్రామపరిధిలోకే వస్తాయి. నలుగురు వైఎస్సార్‌సీపీ తరపున, ఒకరు టీడీపీ తరపున కౌన్సిలర్లు గెలుపొందారు. గత ఏడాది అక్టోబర్‌లో మున్సిపాలిటిలో గ్రామాల విలీనం అనంతరం దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే విధించింది. దీంతో మున్సిపల్ అధికారులు గతంలో స్వాధినం చేసుకొన్న పంచాయితీ రికార్డులు తిరిగి అప్పగించారు. అప్పటి నుంచి పంచాయితీ అధికారులకే వద్దనే రికార్డులు ఉన్నాయి. ఎలాంటి అభివృద్ది పనులు చేయాలన్నా కోర్టు స్టే నేపథ్యంలో ఇటు మున్సిపాలిటి అధికారులు గాని, పంచాయితీ అధికారులు గాని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో ఏడాది నుంచి ఈ గ్రామంలో అభివృద్ది అటకెక్కింది. పారిశుధ్య, డ్రైనేజీ సమస్యలతో పాటు తాగునీటి సమస్య కూడా వేధిస్తుంది.
ఇక మానుకొండవారిపాలెం మున్సిపాలిటిలో 11 వవార్డు పరిధిలో ఉంది. పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు సైతం తాగునీటి అవసరాల కోసం పట్టణంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. డ్రైనేజీ, పారిశుధ్య సమస్య ఉంది.
అభివృద్ది అంతా ఒక్కరోజులోనే, ఒక్క సంవత్సరంలోనూ జరిగే ప్రక్రియ కాదు. ఇందుకు నిధులు కొరత కూడా సమస్యే. పాలకులకు సమస్యల పట్ల, సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ది అవసరం. ఎన్నికైన వార్డు సభ్యులు అందరూ సమస్యలపై అవగాహన ఉన్నవారే కావటం, రాష్ట్రంలోనూ, స్థానికంగానూ ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో అనేక సమస్యలు పరిష్కారయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.




Post A Comment:
0 comments: