వారంతా బక్క జీవులు.. భూమినే నమ్మకున్న భూమి పుత్రులు. చిన్న,సన్న కారు రైతులు. ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగుచేసుకుంటూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. దేశంలోని ప్రతి రైతుకు ఉన్నట్లు వీరికి ప్రకృతి పరమైన అతివృష్టి, అనావృష్టితో వీరు నష్టపోవటంలేదు. అధికారంలో ఉన్న పార్టీలతో వీరికి భూములకు ముప్పు వాటిల్లింది. నోటికాడ వచ్చిన కూడు గద్దెల్లా కొంతమంది లాక్కోవటానికి ప్రయత్నిస్తుంటే వీరేం చేయాలి...?
చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడవల్లి ఎస్సీల భూముల విషయం నేడు తిరిగి హాట్ టాపిక్‌గా మారింది. అసలు యడవల్లి భూముల కథమేమిటి..;? అసలు యడవల్లి భూముల చుట్టూ జరుగుతున్న వివాదం ఏమిటి ?.. మీ కోసం వరస కథనాలు...
ఇదీ సంగతి..
1973లో నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న 360 ఎకరాల ప్రభుత్వ భూమిని 120 మంది ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఇవ్వగా లబ్ధిదారులు పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనంతరం 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినపుడు ఈ భూమికి మరో 45.50 ఎకరాలను కలిపి(మొత్తం 405.50 ఎకరాలు) అవే ఎస్సీ కుటుంబాలకు చెందిన 250 మంది లబ్ధిదారులకు విడివిడిగా పంపిణీ చేశారు. భూముల్లో వ్యవసాయం చేసేందుకు అవసరమైన సాగు నీరు సరిగా అందటం లేదని లబ్ధిదారులు వాపోతుండటంతో 2006లో నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సమస్యను సీఎం వైఎస్ దృష్టి కి తీసుకువెళ్లారు. దీనికి స్పందిస్తూ రూ. 3.06 కోట్ల అం చనాతో సోమేపల్లి సాంబయ్య లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేశారు. 2008లో ఈ పథకం ప్రారంభం కావటంతో లబ్ధిదారుల సమస్య చాలావరకు తీరింది.
గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది...?
యడవల్లి ఎస్సీలకు ప్రభుత్వమిచ్చిన భూముల్లో గ్రానైట్ నిల్వలున్నట్టు తెలియటంతో గతంలో మైనింగ్ శాఖ అధికారులతో అనధికారికంగా రహస్య సర్వేలు నిర్వహింపజేశారు. 250 ఎకరాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. దీంతో అప్పట్లో
యడవల్లిలోని 380, 381-15, 16, 17, 20-2ఎ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ నిల్వలను తవ్వుకునే లీజు కోసం నిరభ్యంతర ధ్రువీకరణపత్రం(ఎన్‌వోసీ) జారీ చేయూలని కోరుతూ మండల తహశీల్దార్‌కు దరఖాస్తులు సమర్పించటం ప్రారంభించారు. పేట ప్రాంతంలోని పది మంది వివిధ పేర్లతో అప్పట్లో 15 దరఖాస్తులను సమర్పించారు.దీంతో యడవల్లి భూముల కథ బయటకు పొక్కింది. గ్రానైట్ నిక్షేపాలున్న భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నారుు. గతంలో ఎకరం ధర రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలుకుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
నాడు ఏం జరిగింది... మిగితా కథనం త్వరలో ...
Post A Comment:
0 comments: