చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న కొండవీడు భవిష్యత్ తరాలకు నాటి యుగ చరిత్రను అందిస్తుంది. ఎతైనకొండల నడుమ, ప్రకృతి శోయగాలతో విరాజిల్లుతూ చిలకలూరిపేట పేరును దశదిశలా వ్యాప్తిచేస్తుంది. సెలవులలో విహార యాత్రలకు వేలాది కిలోమిటర్ల దూరం వెళ్లే వకన్నా మన నియోజకవర్గంలో ఉన్నకొండవీడును సందర్శించవచ్చు. ఈ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లటమంతే ప్రాచీన కట్టడాలు, చరిత్రను ఒక సారి స్మరించుకోవటమే. అత్యధిక వనమూలికలు ఉన్న ఈ ప్రాంతంలో స్వచ్చమైన గాలిని ఆస్వాదించటమే.ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. దీంతో ఈ ఏడాదే కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం ఘాట్ రూట్ ఏర్పాటు చేసిన తరువాత కొండమీదకు వెళ్లేందుకు మార్గం సుగమనమైంది.
కొండవీడుకోట యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట - గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం, చెంఘీజ్‌ఖానపేట మీదుగా కొండవీడుకు చేరుకోవచ్చు. గుంటూరు - నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. జాతీయ రహదారి నెం.5కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కొండవీడుకోట ఉంది.
సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. కాకతీయుల సామ్రాజ్యం ముగిశాక తెలుగు గడ్డను రక్షించుకునేందుకు కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న 74 మంది రాజులు ఏకతాటిపై ఉండి ముస్లిం పాలకుల చెర నుంచి కోస్తా ఆంధ్ర విముక్తికి ప్రతినబూనారు. రెడ్డి రాజులలో ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజ్యంపై శత్రుమూకలు తరచూ దాడులు చేస్తుండడంతో కొండవీడును రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అనపోతారెడ్డి(క్రీ.శ 1353-64)రాజ్యపాలనను చేపట్టి రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. కొండవీడును శతృదుర్బేర్యధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది. అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి (క్రీ.శ 1364-86) రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం కుమారగిరిరెడ్డి (అనపోతారెడ్డ్డి కుమారుడు) 1386-1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరించాడు. క్రీ.శ 1402-1420 వరకు పరిపాలించిన అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఈయన ఆస్థానంలో శ్రీనాథ కవి విద్యాధికారిగా పనిచేశాడు. చివరి వాడైన రాచ వేమారెడ్డి (క్రీ.శ 1420-24) అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు.
గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరాన్నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంది. శత్రువులు చొరబడకుండా రెండు కొండలను కలుపుతూ 50 అడుగుల ఎత్తు, వెడల్పు ఉండేలా మట్టికట్టను నిర్మించారు. కొండ దిగువ న చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటి ని నింపి మొసళ్ళను వదిలి అగడ్తగా రూపొందించారు. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్బుతం గా తీర్చిదిద్దారు. కోట రక్షణ కోసం కొండల అంచున 24 బురుజులను నిర్మించి సైనికులను కాపలాగా ఉంచేవారు. బురుజుల్లో ప్రధానమైనవి తారా బురుజు. దీనినే చుక్కల బురుజుగా వ్యవహరిస్తారు. వీటి తరువాత మహాద్వారం వైపున ఉన్న జెట్టి బురుజు, నెమళ్ళబురుజు, రమణాల్ బురు జు, సజ్జామహల్, బా-ఖిల్లా బురుజు, మిరియాలచట్టు బురుజులు ముఖ్యమైనవి. కొండలపైనే రాజు, రాణిల కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ, గజ శాలలు, నేతి కొట్టు, తీర్పుల మందిరాలను ఏర్పాటు చేశారు. కొండలపై రాజప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందు లు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. వర్షాలు కురిసినప్పుడు ఒక దాని తరువాత ఒక టి నిండేలా వాటిని మలచడం, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు మత్తిడిని (తూము) నిర్మించడం విశేషం.
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే. కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ శిల్పకళా సంపదను ఒకచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేసి కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం, మశీదు, దర్గాకొండ, దిగువన కొత్తపాలెంలోని వీరభద్రస్వామి ఆలయం, కొండవీడులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట గ్రామం పరిధిలోని గోపీనాథస్వామి దేవాలయం, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ కొండపై ఉన్న మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి.వెన్నముద్దల బాలకృష్ణుడికి స్వర్ణమందిరం నిర్మించేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్‌లో భాగంగా స్వర్ణమందిరం, వేద విశ్వవిద్యాలయం, ఆసుపత్రి, గో విశ్వవిద్యాలయంలను నిర్మించనున్నారు.
x




Post A Comment:
0 comments: