సత్యమేవ జయతే’ అన్న సంస్కృత సుభాషితాన్ని గురించి పదే పదే చెప్పుకుంటాం కాని అసత్యాలకు ఉన్న విలువ సత్యానికి లేదు. పుకార్లకు ఉన్న విలువ వాస్తవాలకు లేదు. దుష్ప్రచారాలకు ఉన్న విలువ నిజాయితీతో చేసిన పనులకు ఉండదు. ఒకరిపై బురద చల్లితే నమ్మేవారి కన్నా వారి గురించి మంచి చెబితే నమ్మేవారు తక్కువ. సోషల్ మీడియా విస్తృతి, వ్యాప్తి జరిగిన తర్వాత మనకు కనబడుతున్న పరిణామాలివి. చిలకలూరిపేట నియోజకవర్గంలో సోషల్ మీడియా పాత్ర ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది.
సమాచారం ఇచ్చిపుచ్చుకోవటంతో మొదలైన సోషల్ మీడియా చిలకలూరిపేటలో ఇప్పుడేప్పుడే వెర్రితలలు వేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీలు సోషల్‌మీడియాపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా యువత రోజులో అత్యధిక భాగం సోషల్ మీడియాతో నే గడుపుతున్నారు. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా తమ ప్రచారాన్ని కొనసాగిస్తే వచ్చే నష్టం ఏమిలేదు. ఆయా పార్టీలకు చెందిన పార్టీ కార్యక్రమాలు, ఇతర సమాచారం ఈ మాధ్యమం ద్వారా పంచుకుంటే నష్టం లేదు కాని అసలు నష్టం అంతా ఒకపార్టీ పై మరో పార్టీ, ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక సామాజిక వర్గంపై మరో సామాజిక వర్గానికి చెందిన దూషణలకు పాల్పడితే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క సారి పలు వివాదాలకు కారణమై సరస్పర దాడులకు కారణమౌతున్నాయి. తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులపై ప్రజల్లో మరింత ద్వేషం పెంచడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్నారు.
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునే సంస్కృతి మనది. మేధావులు అనేక శిబిరాలుగా విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇప్పుడు భావజాలాలతో కానీ, సిద్ధాంతాలతో కానీ, మేధావులతో కానీ పెద్దగా పనిలేదు. ఒక వ్యక్తి కానీ, ఒక వర్గం కానీ తమకు వ్యతిరేకమైన శిబిరానికి చెందిన వాడైతే చాలు, ఆ వ్యక్తి గురించి ఆ వర్గం గురించి దూషణలు, దుష్ప్రచారాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ తిట్లకున్న ప్రాధాన్యత చర్చకు ఉండదు. ఈ మాధ్యమం ద్వారా ఎన్నికల రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చ ఉంటే బాగుంటుంది. ఈ దిశగా చిలకలూరిపేటలో ఉన్న సోషల్ మీడియా టీమ్‌లు పనిచేయాలని కోరుకుంటూ ...


Post A Comment:
0 comments: