వారు పాత కలపకు ప్రాణం పోస్తారు...నిరుపయోగంగా మారిన పాత కలపకు నగిషీల హోయలొలకిస్తారు...తాము ఉపాధి పొందుతూ ఎందరో కార్మికులకు జీవనోపాధి కల్పిస్తారు. తాము చేసే పనిద్వారా కలపకోసం చెట్ల నరికివేత తగ్గేలా చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములౌతారు. చిలకలూరిపేట పాత కలపతో చేసే తలుపులు, కిటికీలు, దర్వాజాలు తదితర గృహ నిర్మాణ అవసరాల కోసం ఉపయోగించే కలప సామాగ్రికి ప్రసిద్ది. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డుతో పాటు ఓల్డ్ బ్యారన్నగర్లో పాత కలప ఫర్నీచర్ దుకాణాలు 120 వరకు విస్తరించి ఉంటాయి. వీటిలో కార్పెంటర్ల నుంచి ముఠా కార్మికుల వరకు సుమారు 600 మంది ఉపాధి పొందుతుంటారు.
. పాత కలపతో ప్రధానంగా సింగిల్డోర్లు, డబుల్డోర్లు ,దర్వాజాలు , కిటికీలు ఇతర సామాగ్రి తయారు చేస్తారు. దీని కోసం వీరికి కావల్సిన ముడిసరుకు పాత కలప మాత్రమే. కొత్తగా ఇళ్ల నిర్మాణం చేయదలిచిన వారు తమ పూర్వీకులు ఏళ్ల నాడు నిర్మించిన దంతెల డాబాలు, మిద్దెలు , పెంకుటిళ్లు , కొష్ట్రాలు కూల్చివేస్తారు. పూర్వకాలంలో ఇళ్ల నిర్మాణంలో విరివిగా టేకు, మద్ది, వేప దుంగలు, దూలాలు ఉపయోగించటం అధికంగా ఉండేది. అలాంటికట్టడాలు కూల్చినప్పుడు వాటి ద్వారా ఎంతో కలప లభ్యమౌతుంది. ఇలాంటి కలపను ఇక్కడి వ్యాపారులు వివిధ ఊళ్లకు తిరిగి కొనుగోలు చేస్తారు. అందులో చెదలు పట్టకుండా , పుచ్చిపోకుండా నాణ్యంగా ఉన్న కలపదుంగలను విడగొడతారు. తలుపులు, ఇతర వస్తువుల తయారీకి అవసరమైన పరిణామంలో చెక్కలను కోసుకుంటారు. ఈ కలపతో తలుపులు, ఇతర ఫర్నీచర్లు రూపొందిస్తారు. డోర్లపై లక్ష్మీదేవి, వినాయకుడు వంటి దేవాతామూర్తుల చిత్రాలతో పాటు నెమళ్లు, ఏనుగులు , కమలం వంటి అందమైన చిత్రాలతో కూడిన నగిషీలు చెక్కిస్తారు.
కొత్త ఫర్నీచర్తో పోలిస్తే వీరు తయారుచేసే వస్తువులు ఎంతో చవకగా లభిస్తాయి. ఉదాహరణకు ప్రధాన ద్వారానికి ఉపయోగించే పెద్ద సైజు సింగిల్ డోర్ కొత్త టేకు తో చేయించాలంటే సుమారు రూ. 25 నుంచి రూ. వేలు ఖర్చు అవుతుంది. అదే టేకు డోర్ను వీరు కేవలం రూ. 6 నుంచి రూ. 1వేలకు అందజేస్తారు. ఇంకా వేప, మద్ది వంటి కలపతో రూ. 2 నుంచి రూ. 5వేల లోపు ధరకే డోర్లను తయారు చేసి రెడిమేడ్గా అందజేస్తారు. దీనితో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పలువురు వీటిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తరలించుకు వెళుతుంటారు. మద్యతరగతి నుంచి సామాన్యుల వరకు ఇళ్ల నిర్మాణంలో వీరు తయారు చేసిన కలప తలుపులు, కిటికీలు ఉపయోగిస్తుంటారు. చేసే శ్రమ ఎక్కువైనా సాధించే లాభం తక్కువైనా సరే తాము నమ్మిన తమకు చేతనైన పనిని సొంతలాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడుతుంటారు. పర్యావరణానికి మేలు... ప్లాస్టిక్ వస్తువుల వంటి వాటిని రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేయటం వలన పర్యావరణానికివిపరీతమైన హాని కలుగుతుంది. అదే పాత కలపను తిరిగి వస్తువులుగా మార్చి వినియోగంలోకి ప్లాస్టిక్ వస్తువుల వంటి వాటిని రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేయటం వలన పర్యావరణానికి విపరీతమైన హాని కలుగుతుంది. అదే పాత కలపను తిరిగి వస్తువులుగా మార్చి వినియోగంలోకి తీసుకురావటం వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పైగా రోజురోజుకు కలప అవసరాలకోసం చెట్లను నరికివేయటం జరుగుతున్న రోజుల్లో ఈ పాత కలప వినియోగం వలన చెట్ల నరికి వేత తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సమాజానికి, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ శ్రమ జీవులకు ప్రభుత్వ పరంగా కాని, బ్యాంకుల పరంగా కాని ఎలాంటి ప్రోత్సాహం లభించకపోవటం విశేషం.



Post A Comment:
0 comments: