సేవా సంకల్పమే ధ్యేయంగా... కొనసాగుతున్న అన్నదానం
శ్రీ షిరిడీ ప్రవేశమే సర్వదుఖః పరిహారంగా భావిస్తారు సాయిభక్తులు. ఆర్తులైన, నిరుపేదలైనా ద్వారకామాయి ప్రవేశంతో దుఖాలు తొలగి సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈర్యా, ద్వేషాలకు లొంగక అహంకార, మమకారాలకు దూరంగా ఉంటూ ఉన్నంతలో ఇతరులకు సహాయపడాలన్నది సాయితత్వం. ఆ తత్వాన్ని అలవర్చుకున్న చిలకలూరిపేటకు చెందిన కొందరు సాయిభక్తులు షిరిడీలో సేవా కార్యక్రమాలు చేపడుతూ సాయిభక్తులకు ఇతోధికంగా సహాయపడుతున్నారు. భక్తులకు అన్నదానంతో మొదలు పెట్టి పూర్తి సౌకర్యాలతో కూడిన అన్నదాన వసతి సత్రాన్ని నిర్మిస్తున్నారు. సేవే లక్ష్యంగా .... మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తూంటారు. అందులో తెలుగువారు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారు. సుదూరం నుంచి వెళ్లే భక్తులు అక్కడ భాష అర్ధం కాక వసతి, భోజనం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా నుంచి వెళ్లే భక్తులకు బాసటగా నిలవాలని కొందరు భక్తులు భావించారు. అలాంటి ఆలోచన వచ్చిందే తడువుగా 2008 వ సంవత్సరంలో పట్టణానికి చెందిన పసుమర్తి శివ సత్యనారాయణ, దుగ్గి వెంకటసుబ్బారావు, శిఖాకొల్లి పాపారావు, దామిశెట్టి శ్రీనివాసరావు, ఆలపాటి శ్రీనివాసరావు, మరికొంతమంది కలిసి ట్రస్టుగా ఏర్పడ్డారు. దివ్యశ్రీ సాయిరామ్అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి షిరిడీలోని మన్నార్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హోటల్ ను అద్దెకు తీసుకొని భక్తులకు నామమాత్రపు ఖర్చుతో వసతి సౌకర్యాలు కల్పించటంతో పాటు నిత్యం 300 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ వచ్చారు.
శాశ్వత భవన నిర్మాణం.... దాతల సహకారంతో షిరిడీలోని బాబా ఆలయానికి రెండు పర్యాంగుల దూరంలోని కాళికనగర్లో 15 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ఐదు అంతస్తులతో 50 గదులతో కూడిన నిత్య అన్నదాన వసతి సత్రం శాశ్వత భవననిర్మాణానికి శ్రీకారం చుట్టారు. . త్వరలోనే భవననిర్మాణం పూర్తి చేసి అన్ని సదుపాయాలతో నామ మాత్రపు ధరలకే ఏసీ గదులను అందిస్తామని, ఉచిత అన్నదాన సౌకర్యం కల్పిస్తామని ట్రస్టు సభ్యులు తెలుపుతున్నారు.

Post A Comment:
0 comments: