గ్రామసింహాల కట్టడి కరువైంది. ఎక్కడ చూసినా శునకరాజాలు గుంపులు,గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సమస్య వచ్చిన నప్పుడు అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో సరిపెట్టే మున్సిపల్, పంచాయతీ అధికారులు చేతులు కాలక ఆకులు పట్టుకొన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వీధి కుక్కలతో జనం భయభాంత్రులకు గురిఅవుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో పట్టణంలో ఒక్కరోజే ఆరుగురిపై పిచ్చికుక్క దాడి చేసి కరిచి గాయపరిచింది. అంతకు ముందు మే 30వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓ పిచ్చికుక్క పట్టణ వీధుల్లో స్వైరవిహారం చేసి ఏకంగా 24 మందిని తీవ్రంగా కరిచిగాయపరచింది. ఇలాంటి సంఘటనలు తరచు చోటుచేసుకుంటునే ఉన్నాయి.
అసలే అంతంత మాత్రం చర్యలు చేపట్టే మున్సిపల్,పంచాయితీ అధికారులకు పలువురు జంతుప్రేమికులు కుక్కల వధపై కోర్టును అశ్రయించటం, వాటి నివారణకు పునరుత్పత్తి సామర్ధ్యం లేకుండా ఆపరేషన్లు నిర్వహించాలని తీర్పుచెప్పటం మరికొంత గందరగోళానికి దారితీసింది. దీంతో కుక్కల నియంత్రణ జరగక అవి పట్టణంలో గుంపులు, గుంపులుగా సంచరిస్తూ పలువురిపై దాడిచేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. ఒక్క ప్రభుత్వాసుపత్రికే రోజుకు ఆరునుంచి ఏడుగురు కుక్కకాటుకు గురై చికిత్సకోసం వస్తుంటారు. ఈ లెక్కన ఇక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందేవారు ఎంత మంది ఉంటారో ఉహించుకోవచ్చు.
పట్టణంలోని ఏమూల చూసినా గుంపులు, గుంపులుగా వీధికుక్కలు సంచరిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తున్నాయి. వీటి నివారణకు చర్యలు చేపట్టేవారే కరువౌతున్నారు. సమస్య పరిష్కరించండి బాబూ అంటూ వేడుకోవటం పట్టణ ప్రజల వంతైంది. పాలకులైతే అసలు ఈ సమస్య గురించి పట్టించుకొనే తీరిక, ఓపిక లేకపోయింది. పట్టణ ప్రజలు అనేకపర్యాయాలు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించనా సమస్య మాత్రం తీరటం లేదు. వెరసి ప్రజలు వీటి బాధ పడలేకున్నారు. వీటికి తోడు పిచ్చి కుక్కలు పలువుర్ని కరిచి గాయపరుస్తున్నాయి. రాత్రి వేళల్లో కొన్ని వీధిల్లో ప్రజలు తిరిగేందుకు సైతం ఈ కుక్కల నుంచి జంకుతున్నారు. చిన్నపిల్లలు సైతం వీధుల్లో ఆడుకుంటూ ఊరకుక్కల బారిన ఎక్కడ పడతారోనని పెద్దలు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితులు పలుగ్రామాల్లోనూ కొనసాగుతున్నా నియంత్రణకు చర్యలు కానరావటంలేదు.
వీరంగం సృష్టిస్తున్న వీధి కుక్కల నియంత్రించటంలో అధికారులు విఫలమయ్యారన్నా విమర్శలు వినవస్తున్నాయి. గతంలో పట్టణ పరిధిలో కొన్ని కుక్కలకు సంతానోత్పత్తి లేకుండా ఆపరేషన్లు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ తదుపరి ఆ ప్రక్రియకు పూర్తిగా స్వస్తి పలికారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. చిలకలూరిపేట పట్టణంలోని 30 పడకల కమ్యునిటీ హెల్త్ సెంటర్లో తరచు యాంటీరేబిస్ వాక్సిన్ అందుబాటులో ఉండకపోవటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క డోసుకు రూ. 350 నుంచి 500 లు ధర పలుకుతున్న ఈ వాక్సినను నాలుగు డోసులుగా వాడవలసి ఉంటుంది. ఇకనైనా విజృంభిస్తున్న కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Post A Comment:
0 comments: