ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆయా పార్టీల మ్యానిఫేస్టోల హామీలతో పాటు స్థానికంగా ఉండే పలు సమస్యలపై నేతలు హామీలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. కొన్ని సమస్యలు ఎప్పటికి పరిష్కారం కావు. ఆ సమస్యలు నిత్యనూతనంగా సజీవంగా ఉంటేనే వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇవ్వవచ్చు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు ఇవే. వీటిని పరిష్కరిస్తారా లేదా అనేది ఆయా నాయకుల తీరుపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వటానికి సమస్యలు ఇలా ఉన్నాయి.
సాగర్ కాల్వల పొడిగింపు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిలకాలవాంఛ. సాగర్ కాల్వలను పొడిగిస్తే చిలకలూరిపేట నియోజకవర్గం సస్యశామలం ఆవటమే కాక, తాగునీటి సమస్య తీరుతుంది. సాగర్ కాల్వలను పొడిగిస్తామని హామీ ఇచ్చేయండి. నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేకపోతుంది. గ్రామాల్లో సురక్షిత మంచినీటి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చేయండి. . చిలకలూరిపేటకు రైల్వే లైన్. ఇదీ ఎంపీ పరిధిలోని హామీ అయినా ఇందుకోసం కృషి చేస్తానని హామీ ఇవ్వవచ్చు. గ్రామాల్లో ఎస్సీలకు చెందిన స్మశానవాటికలు ఆధ్వాన స్థితిలో ఉన్నాయి. అనేక స్మశాన వాటికలు ఆక్రమణలకు గురి అయ్యాయి. స్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వవచ్చు. రజకులు దోభీభానాలు కావాలని కోరుతున్నారు. వాగులు ఆక్రమణకు గురికావటం, నీరు కలుషితమవ్వటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని రజకులకు దోభీఖానాలు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వవచ్చు. చిలకలూరిపేట పట్టణంలో ముస్లింల పండుగల సమయంలో ప్రార్ధన చేసుకొనేందుకు ఉన్న ఈద్గా సరిపోవటంలేదు. ఈద్గా భూమి ని కేటాయిస్తామని హామీ ఇవ్వవచ్చు.. పట్టణంలో పారిశుధ్యం మెరుగుకు కృషి చేస్తానని, ఆండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వవచ్చు... వాగుల ఆధునీకరణ, కరకట్టులు నిర్మిస్తామని హామీలు ఇవ్వవచ్చు. గతంలో ప్రతిపాదనలతో మిర్చియార్డు నిలిచిపోయింది. స్థానిక మిర్చి రైతుల అవసరాల నిమిత్తం నియోజకవర్గంలో మిర్చియార్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇవ్వవచ్చు.
ఇలా గ్రామానికి,వార్డులకు ప్రత్యేక మైన సమస్యలు కూడా ఉన్నాయి. ప్రచారానికి వస్తున్న నేతలు ఈ అంశాలపై దృష్టి పెట్టండి మరి.


Post A Comment:
0 comments: