చిలకలూరిపేట నియోజకవర్గంలో డబ్బు తియనిదే ఎన్నికల్లో ఏ పార్టీ నాయకుడైనా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రాజకీయపార్టీల డాంబికమేగాని, డబ్బు వెదజల్లనిదే కార్యకర్తలుగా వెంటనడిచి మెడలో పార్టీ కండువా వేసుకునే శాల్తీలే కరవయ్యారు. జనసందోహాన్ని ముందుగా ‘బుక్’ చేసుకుంటే తప్ప ప్రచారం కళ కట్టలేని దుస్థితి, పార్టీల దివాలాకోరుతనాన్నే పట్టిస్తోంది.
ప్రజలతో మమేకమై వారి అశలు, ఆకాంక్షలు పట్టించుకుంటే , తమ ఇంట్లో తిని మీ ఇంట్లో పనిచేయమంటే ఎవరు చేసే పరిస్థితిలో లేరన్నది వాస్తవం. ప్రయత్నపూర్వకంగా సమీకరిస్తేనే తప్ప, జనం తమంత తాము సభలకు స్వచ్ఛందంగా తరలిరాని దుస్థితికి అవి చేరుకున్నాయి. పార్టీలు, అభ్యర్థులు ఎడాపెడా దిమ్మరించే హామీలకు ప్రజానీకంలో విశ్వసనీయత ఏనాడో కొల్లబోయింది. ఆ నిజాన్ని ఓ పట్టాన ఒప్పుకోని పక్షాలు ప్రత్యర్థులమీద తమదే పైచేయి అని చాటుకోవడానికి ధూమ్‌ధామ్‌గా సభలు నిర్వహించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తలపోస్తున్నాయి. ఎంత ఎక్కువ మందిని కూడగడితే అంత ఘనతగా భావిస్తున్నాయి. జనసమీకరణలో రికార్డులు బద్దలుగొట్టడమన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకప్పటిలా రాజకీయ పక్షాలకిప్పుడు పెద్దయెత్తున పూర్తికాలం కార్యకర్తలు దొరకడంలేదు. సందర్భానుసారంగా తాత్కాలిక ఏర్పాట్లతో గుట్టుగా ప్రచారయాత్రలు కానిచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది.
సీసాలు తాగే పైసలు కాళ్లు తడవకుండా సాగరాన్ని దాటవచ్చేమో కానీ.. మందుబాబుల నోరు తడపకుండా ఎన్నికలను దాటలేరు. ఎన్నికల్లో మద్యం ప్రభావం బహిరంగ రహస్యమే. ఒక్కో సారి నగదు పంపిణీ కంటే.. మద్యం సరఫరాపైనే ప్రధాన పార్టీలు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాయి. ప్రచారం మొదలు పెట్టిన తర్వాత పోలింగ్ జరిగే నాటి వరకు మద్యాన్ని కేడర్‌కు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. . ప్రచార సమయంలో కేడర్ తిరగడానికి వాహనాలు, తినడానికి ఆహారం ఎంత అవసరమో మద్యం కూడా అంతే అవసరం. ఇక, పోలింగ్‌కు ముందు ఓటర్లకు పెద్ద ఎత్తున మందు సరఫరా సరేసరి.
పార్టీల హామీలు, మేనిఫెస్టోల కంటే.. పోలింగ్‌కు ముందు పంపిణీ చేసే నగదు, మద్యం, బహుమతులే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నది విశ్లేషకుల మాట. దాంతో, ఎన్నికల్లో భారీగా వ్యయం చేయడానికి అభ్యర్థులు కూడా ముందే సన్నద్ధమవుతున్నారు. ఇక, పార్టీలు కూడా అభ్యర్థుల గెలుపునకు 'ఇతోధికం'గా సాయం చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు అంటే ధన ప్రవాహమే!


Post A Comment:
0 comments: