చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. అవి త్వరగా పక్వానికి వచ్చేందుకు కాల్షియం కార్బైడ్ లేదా పొగబెట్టే పద్ధతిని వినియోగిస్తున్నారు. మామూలుగా సహజసిద్ధంగా పండిన వాటిలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం నీరసించినప్పుడు ఉత్తేజం కలిగించటంతోపాటు, ఆహారం జీర్ణం కావటానికి, మలబద్ధకాన్ని రూపుమాపేందుకు తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో వీటి శాతం చాలా తక్కువ. అనారోగ్యం బారిన పడే అవకాశమే ఎక్కువని వైద్యనిపుణులు చెప్తున్నారు.ఇటీవల గాలిదుమారానికి కిందపడిన మామిడి పండ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని గోదాములకు తరలిస్తున్నారు.
గోదాముల్లో నిల్వ ఉంచిన కాయలను పొట్లాల్లో నింపిన కాల్షియం కార్బైడ్‌తో మాగపెడుతున్నారు. కాల్షియం కార్బైట్‌తో వేడి పుట్టించటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి నాలుగు రోజుల్లో కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఇలా మాగించిన పండ్లు రిటైల్ వ్యాపారులకు, తద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే పండ్ల బాక్సుల్లో కాల్షియం కార్బైడ్ ప్యాకెట్లు అమర్చి ఉంచుతున్నారు. అవి నిర్దేశిత ప్రాంతానికి చేరుకునేలోగా కాయలు మాగుతున్నాయి. ఈ రసాయనాల కారణంగా మామిడి పండ్లు సహజ గుణం కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి.
శాస్త్రీయ పద్ధతుల్లో ఆయితే ఇలా..
చిలకలూరిపేటలో పండ్లు మాగపెట్టేందుకు మూడేళ్ల కిందటే మార్కెట్ యార్డులో పండ్లు మాగబెట్టే గదిని ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని వినియోగించుకొన్నవారిని వేళ్లమీద లేక్క పెట్టుకోవచ్చు. మామిడి పండ్లను చెట్టుపైనే బాగా ముదిరిన తర్వాత కోయాలి. అలా కోసిన పండ్లపైన వరి గడ్డి వేయాలి. ఇలా వారం రోజుల పాటు ఉంచడం వల్ల పండ్లు మధురమైన రుచి, వాసనను, పోషక విలువలను సంతరించుకొని సంపూర్ణంగా తినడానికి అనుగుణంగా ఆరోగ్యకరంగా ఉంటాయి. గతంలో మామిడి పండ్లను ఇలానే పండించి విక్రయించేవారు.
నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షలు జరిమానా
మామిడి కాయలను కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ రూల్స్-1995 రూల్ నెంబర్ 44 (ఏఏ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టడంపై నిషేధం విధించాయి. దీనిని అతిక్రమించిన వారికి మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలా మాగించిన పండ్ల అమ్మకాలను అడ్డుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన, వైద్యారోగ్య అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమైన నగరాల్లోని పండ్ల మార్కెట్‌లలో తనిఖీలు చేసి కాల్షియం కార్బైడ్ వినియోగించే వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తున్నది.
కాల్షియం కార్బైడ్‌తో అనారోగ్యం
కాల్షియం కార్బైడ్ అనేది సాధారణంగా గ్యాస్ వెల్డింగ్‌లో వినియోగిస్తారు. ఇది బహిరంగ మార్కెట్‌లో దొరుకుతుంది. కిలో రూ. 80 మాత్రమే ఉంటుండటం వ్యాపారులకు కలిసి వస్తున్నది. మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్నది. కాల్షియం కాైర్బెడ్ మనం తినటం వల్ల గ్యాస్ట్రిక్, మూత్రపిండ సంబంధ వ్యాధులు, ఎలర్జీతో పాటు కొన్ని సందర్భాల్లో కంటి చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాడీ వ్యవస్థ పనితీరుపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.



Post A Comment:
0 comments: