చిలకలూరిపేటలో ఇప్పటి తరం మునుప్పుడు చూడని దృశ్యం ఆవిష్కృమైంది. కరోనా వ్యాధి దెబ్బకు నియోజకవర్గం నిర్మానుషంగా మారింది. కొన్ని రోజుల కిందట వేలాదిగా ఎటు చూసినా జనవిస్పోటనంగా ఉన్న పట్టణం బోసిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రభావం ఇప్పుడు చిలకలూరిపేటలో సామాన్యులు, పేదలపై పడింది. రోజువారి కూలీపనులు చేసుకొని పొట్టనింపుకొనే పేదలకు కరోనా కోలుకొని దెబ్బకొట్టింది. వీరి పట్ల ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూ కాదు కాబట్టి ఈనెల 31వ తేదీ వరకు బతకటానికి భరోసా అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 29వ తేదీ బియ్యం,కందిపప్పు పంపిణీ చేస్తానని ముందుకు వచ్చిన నేపథ్యంలో స్వచ్చంధ సంస్థలు ప్రజలు పెద్ద మనసుతో స్పందించాల్సిన అవసరం ఉంది.
ప్రజల మధ్య సంబంధాలను పెంచాల్సిన సోషల్ మీడియా నియోజకవర్గంలో పుకార్లకు కారణమౌతుంది. ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని చెబుతున్నా ఫలనావారికి కరోనా ఉందంటూ చేస్తున్న ప్రచారాలు మానుకోకపోతే ప్రభుత్వమే కేసులు పెట్టనుందన్న విషయం తెలుసుకోవాలి.
నిత్యావసరాల ధరలు కట్టడి చేస్తామని చెబుతున్నా ఆచరణలో ఇది సాధ్యం కావటంలేదు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి పోయాయి. మాస్కులు, శానిటేజర్లు ధరలు పెంచి అమ్ముతున్నారు. వివిధ పనులపై ఇక్కడికి వచ్చిన వారు తమ స్వంత ఊర్లకు వెళ్లటానికి ఇబ్బందిపడుతున్నారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా పనిచేస్తూన్నారు.
మొత్తం మీద ప్రజల స్వీయనియంత్రణ, స్వీయ నిర్భంధమే కరోనా వ్యాధి నియంత్రణకు మందు. కాబట్టి ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఇళ్లకే పరిమితమౌద్దాం. చిలకలూరిపేటలో ఏ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడదాం. మన నియోజకవర్గ ప్రజల స్ఫూర్తిని రాష్ట్రానికి చాటుదాం.



Post A Comment:
0 comments: