చిలకలూరిపేటలో లాక్‌డౌన్ అధికారుల సమన్వయంతో ఆశించిన స్థాయిలోనే విజయవంతం అవుతోంది. కరోనా వైరస్ దెబ్బతో బతికుంటే చాలు అన్న విధంగా పేదలు, కూలీలు ఒక పూట తిని, తినక బతుకును భారంగా లాక్కొస్తున్నారు. డబ్బులు ఉన్నవారు హోల్‌సెల్‌గా నిత్యావసరాలను నిల్వ చేసుకుంటే, పేదలు మాత్రం ఏ రోజుకు ఆరోజు డబ్బుల లభ్యతను బట్టి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
పారిశ్రామిక వాడ గణపవరం,తిమ్మాపురం తదితర ప్రాంతాలలో ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు వలస కార్మికులు ఆయా కంపెనీలలో పనిచేస్తుంటారు. అత్యధిక కంపెనీలు నిలిచి పోవటంతో వారు సొంత ఊరికి వెళ్లలేక, ఉన్న చోట ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు.
నియోజకవర్గ పరిధిలో రోజువారి కూలీలకు బతుకు భారంగా మారుతుంది. స్థానికంగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ. నియోజకవర్గం నుంచే కాకుండా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానికంగా ఉపాధి దొరికేది. ఈ రంగంపై భవన నిర్మాణ కూలీలు కాక ప్లంబర్లు, ఎలక్ట్రీషీయన్లు, కార్పోంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్ పనివారు ఆధారపడేవారు. వారికి ఉపాధి కరువైంది.
ముఠాకార్మికులు, తోపుడు బండ్లపై చిరువ్యాపారులు చేసుకొనే వారు, చిరు వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరికి కరోనా గట్టిగానే తగిలింది.
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే గుమాస్తాలకు, దుకాణాలలో పనిచేసే సెల్స్‌మెన్స్ వీరి జీతాలు రావు కనుక ఈనెల గడవటం ఇబ్బందే.
ఇక అందరికష్టాలను వెలుగులోకి తెస్తూ, వారి బాధలు,కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకొన్న విలేకర్ల పరిస్థితి పేదల,కూలీ పరిస్థితికి అతీతం కాదు. అనేక నియోజకవర్గాలలో స్థానిక రాజకీయ నాయకులు, స్వచ్చంధసంస్థలు విలేకర్లకు ఆసరా అందిస్తున్నాయి. పేటలో అటువంటి సహాయమే కావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది ఎన్నడు ఎరగని విపత్కర పరిస్థితి. తుఫాన్లో,భూకంపాలో మరోదో ప్రకృతి విపత్కరణ పరిస్థితో కాదు. ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయం చేయటానికి ముందుకు వచ్చింది. కాని ఈ సహాయం సరిపోదు. ఇంకా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు బతుకును ఎలాగో అలా లాక్కోచ్చిన పేదలు, కూలీలకు ఇక రోజు గడిచే కొద్ది దినదినగండంగా మారుతుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ ఉంది. దీనితో పాటు మనసున్న ప్రతి ఒక్కరూ పక్కవారి నుంచి ఆలోచించాల్సిన సందర్బం వచ్చింది. రానున్న రోజుల్లో కరోనా వ్యాధి సోకి మరణించేవారికన్నా ఆకలితో మరణించే అవకాశం ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయట పడలో, మనతో పాటు అన్నార్తులకు ఆపన్నహస్తం అందించి ఏ విధంగా సహాయం చేయాలో ఒక్కసారి ఆలోచించండి...


Post A Comment:
0 comments: