చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ ఒకవైపు సత్ఫలితాలను ఇస్తుండగా మరోవైపు నిరాశ్రయులైన పేదలు నిస్సహాయులుగా మారిపోయారు. దాతల సహాయం ఒక పూట తిండికి సరిపోతుండగా మరో పూట పస్తుంటున్నారు. ఆదివారం అలాంటి సహాయం కూడా పెద్దగా అందలేదు..తలదాచుకునేందుకు గూడు, కడుపు నింపేందుకు కూడు, కట్టుకునేందుకు గుడ్డకు నోచుకోక తల్లడిల్లిపోతున్నారు. దయనీయంగా చేతులుచాచే జనంతో పట్టణ వీధులు కనిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ ఆంక్షలతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లలో జనసంచారం లేక బోసిపోయింది. రోడ్డువారగా, బస్‌స్టేషన్లు వద్ద పడిగాపులు కాస్తూ ప్రయాణికులు ఇచ్చి తినుబండారాలు, ఆహార పదార్థాలతోనే కడుపునింపుకునే యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల ముందు కూర్చుని ప్రజలు వేసే భిక్షపైనే ఆధారపడి బతికే బీదాబిక్కీ జనానికి రోజు గడపడమే కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
వీరుగాక భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు నియోజకవర్గం నుంచే కాక సమీపన ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా వేలాది మంది పట్టణానికి చేరుకొనే వారు. వీరు కూడా కనీస అవసరాలు తీరక, అన్నమో రామచంద్రా అంటూ ఆకలి కేకలు పెడుతున్నారు. గూడు, గుడ్డ లేకున్నా సర్దుకుపోగలం... ఆకలి తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయమేది అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమందికి చేతిలో డబ్బులున్నా సాయంత్రం వేళల్లో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. డబ్బులొద్దు... తినేందుకు ఏమైనా ఉంటే ఇవ్వండని వేడుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఆహారం సంగతి అటుంచి గొంతెడితే దాహం తీర్చుకునేందుకు సైతం వీలులేకుండా పోయింది. నిరాధారం, నిరాశ్రయంగా సంచరించేవారిలోని వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఆకలిదప్పులతో అడుగు తీసి అడు గువేయలేక మూసిఉన్న అంగళ్ల ముందు పడుకుని ఉండిపోతున్నారు.
దాతల సహాయం అన్ని నియోజకవర్గాలతో పోల్చి చూస్తే కాస్త మెరుగుగా ఉన్నా, ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంతో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు సహాయానికి సైతం పలు అంక్షలు అడ్డుగా మారటం, సాహాయం చేయటానికి అనుమతులు తీసుకొవల్సి రావటంతో పలువురు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని తప్పుకుంటున్నారు. దీంతో వీరి పరిస్థితి దినదినగండంగా మారింది.



Post A Comment:
0 comments: