లాక్‌డౌన్ నేపథ్యంలో గుప్పెడు మెతుకులు కోసం నిరుపేదలు అల్లాడుతున్నారు. బంగారం అమ్ముకొంటూ, అవసరాల కోసం ఉంచుకొన్న డబ్బులు మొత్తం నిత్యావసరాల కోసం వెచ్చిస్తున్నారు. కాని నియోజకవర్గంలో కొంతమంది వ్యాపారుల కక్తుర్తి పేద ప్రజలకు శాపంగా మారుతుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్క పెట్టుకోవాలన్న సూక్తిని వారు లాక్‌డౌన్ సమయంలో క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా వేళ.. నిత్యవసర వస్తువులకు పెరిగే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు ముందు జాగ్రత్తగా సరుకుల్ని కొని పెట్టుకున్నారు. పేదలు . వివిధ కారణాలతో ఆలస్యమైన వారు అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు,. ప్రతి దుకాణం ముందు నిత్యావసర ధరల బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రకటనలు చేస్తారు. రెండు మూడు రోజుల పాటు కొంత మంది అధికారులు హడావిడి చేస్తారు. ప్రజలు నిత్యావసరాలు అన్ని ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే అందుబాటులోకి వస్తాయని ఆనంద పడతారు. కాని దుకాణం వద్దకే చేరుకుంటే అసలు కథ బోధపడుతుంది. ఇదంతా మాములే.. అనుకుంటూ ప్రజలు అధిక ధరలు చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇది ఏ ఒక్క వ్యాపారికే సంబంధించిన విషయం కాదు. ఏదో మారుమూల గల్లీలో ఉండే చిన్న దుకాణాలకే సంబంధించిన వ్యవహారం కాదు. ఏవరైనా ఉన్న రేటుకే సరకులు అమ్మాలన్నా ఇది సాధ్యం కాదు. పైన ఉన్న వ్యాపారి సరైన ధరలకే సరకులు అందజేస్తే, కింద ఉన్న వ్యాపారి దాన్ని అనుసరిస్తారు. కాని ఇది చక్రబంధం. పై నుంచి కింద దాక ఒకటే వ్యవహారం.
వ్యాపారులు తమ సరకులు అమ్ముకోవటానికి సడలింపులు కావాలి. కాని ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు సరకులు అందించటానికి వారికే మాత్రం రూల్స్ ఉండవు. సరకు రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో ధరలు తగ్గాయా..? అంటే లేదనే చెప్పాలి. ఇది కిరాణా దుకాణాలకే సంబంధించిన విషయం కాదు. కూరగాయల ధరలు ఇలాగే ఉన్నాయి. మెడికల్ దుకాణాలలో సైతం ఇదే రకమైన తంతు కొనసాగుతుంది. వారు నిర్దేశించిన రేటుకే మందులు కొనుగోలు చేయాలి. లేదా ఆ మందు స్టాక్ లేదని సమాధనం చెబుతున్నారు.
కరోనా వ్యాప్తి జరగకుండా అధికారులు, ఎమ్మెల్యే విడదల రజని చిలకలూరిపేట నియోజకవర్గంలో చేస్తున్న కృషి అభినందనీయం. అధికారులు అంతా లాక్‌డౌన్ విధుల్లో నిమగ్నమైన వేళ కొంతమంది వ్యాపారులు ఇటువంటి కక్కుర్తికి తెరతీయటం గర్హనీయం. ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపి సరైన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు. అత్యవసర వేళలోనూ ఆరాచకం చేస్తున్న వ్యాపారులకు ముకుతాడు వేస్తారా..?.

Post A Comment:
0 comments: