‘బిడ్డా ఆ దేవుడు నా రాత సక్కగ రాయలేదు. మీ నాన్నను తీస్కపోయిండు. సత్తువ ఉన్నంతవరకు మిమ్మల్ని సాదిన..నువ్వు నా బిడ్డవైనా మంచాల పడ్డ తర్వాత…మా అమ్మ లెక్క చూసుకున్నవ్. కానీ ఏం చేసేదే…ఇగ నేను బతికెటట్టు లేను…నీకు తమ్ముడు…తమ్మునికి నువ్వు. ఎవరింటికి పోవద్దు. కష్టపడి పనిచేసుకోవాలె. తమ్ముడిని మంచిగ చదివించు. అరేయ్మల్లికార్జునా…అక్కకు పెండ్లి చేసే బాధ్యత నీదే…అక్కనైతే ఇడువకు. ’.. అంటూ ప్రణాలు వదిలింది ఆ తల్లి. హృదయాలను ద్రవింపచేసే కన్నీటి కథ ఇది.
తెలంగాణాలోని జగిత్యాలలో గోవింద్ పల్లెకు చెందిన కొలగాని గంగారెడ్డి-, కమల దంపతులకు కూతురు నాగలక్ష్మి(17) , కొడుకు మల్లికార్జున్ (13) ఉన్నారు. పదేండ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా అప్పటి నుంచి కమల కూలీ పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. కష్టపడుతూనే ఇద్దరినీ చదివిస్తోంది. మూడేండ్ల క్రితం ఆమెకు టీబీ వ్యాధి సోకడంతో మంచాన పడింది. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు నాగలక్ష్మి కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది. కూలీ పనికి పోతూ తల్లికి వైద్యం అందిస్తూ తమ్ముడు మల్లికార్జున్ ను చదివిస్తోంది. అంతా మంచే జరుగుతుందనుకుంటున్న తరుణంలో తల్లికి వ్యాధి ముదిరింది. దీంతో మందులకు కూడా కూలీ డబ్బులు సరిపోని పరిస్థితి ఎదురైంది. దీంతో నెల క్రితం ఓ మెడికల్షాపులో పని వెతుక్కుంది. నెల జీతం కింద అమ్మకు మెడిసిన్స్ తీసుకువెళ్లేది. అయినా నాగలక్ష్మి కష్టం వృథానే అయ్యింది. వ్యాధి ముదరడంతో సోమవారం అక్కా, తమ్ముడు కలిసి తల్లిని దవాఖానాకు తీసుకువెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది.
నాగలక్ష్మి తల్లి కమల ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఎక్కడ తమ ఇంట్లో చనిపోతుందోనని అరవింద్నగర్లోని ఇంటి ఓనర్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాడు. మానవత్వం లేకుండా ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో నాగలక్ష్మి నెలరోజులుగా తిరుగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయం కావడంతో ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వారం క్రితం నెలకు రూ.మూడున్నర వేల కిరాయితో ఓ ఇంటిలో రెండు రూములు దొరికాయి. అయితే ఇంట్లో చేరిన రెండు రోజులకే కమల పరిస్థితిని చూసిన అక్కడి యజమాని కూడా ఇల్లు ఖాళీ చేయాలని మంకుపట్టు పట్టాడు. దీంతో సామానంత మూట గట్టుకుని ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాగలక్ష్మి రూముల కోసం తిరిగింది. అయినా ఎక్కడా దొరకలేదు. సోమవారం తల్లి మాట కూడా పడిపోవడంతో దవాఖానకు తీసుకువెళ్లగా చనిపోయింది. ఇంటి ఓనర్ రానిస్తడో లేదో అనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లో పని చేసే కార్యకర్త ఇంట్లో తలదాచుకున్నారు.
వీరికి నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. చివరికి అనాథ శవంగా మున్సిపల్ కార్మికులు జగిత్యాల సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
---(ప్రభాతవెలుగు సౌజన్యంతో)
ఈ సంఘటన మన రాష్ట్రంది కాదు. మన జిల్లాది కాదు. కాని కరోనా నేపథ్యంలో ఇలా వెలుగులోరాని కన్నీటి కథలెన్నో మన పక్కనే ఉన్నాయి. కరోనా సోకిందనగానే ప్రజలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. మన పక్కింట్లో చిన్న పాటి దగ్గు వినిపించినా, జ్వరం వచ్చినా కరోనా వచ్చిందని హడావిడి చేసే ప్రజలు ఎక్కవయ్యారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు కావల్సింది ఆపన్న హస్తం. కాసింత సానుభూతి, కాస్తా ఓదార్పు. కాని మనవత్వం మరిచిపోయి కరోనా సోకిన బాధితుల పట్ల మృగాల్లా ప్రవర్తించటం ఎంత వరకు సబబు ఆలోచించండి. పట్టణంలోని సుబ్బయ్యతోట, గణపవరంలో ఇలాంటి అనుమానాలతో ప్రజలు హడావిడి సృష్టించారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి మాటలను గుర్తుచేసుకుంటూ... రానున్న రోజుల్లో కరోనాతోనే ఉండాల్సిన పరిస్థితి. ఎవరో ఒకరు మిగిలి ఉన్నా మళ్లీ అందరికీ వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా వస్తే అంటరాని వారిలాగా భావించవద్దు, రేపు నాకు రావచ్చు ఎల్లుండి ఇంకొకరికి ఈ వ్యాధి రావచ్చు. అందరం జాగ్రత్తగా ఉండాలి

Post A Comment:
0 comments: