స్పందనకు వందనం ... మానవత్వం పరిమళించింది.
మిట్ట మధ్యాహ్నం .. ఎండ తీక్షణంగా ఉంది. ఆ సమయంలో అడ్డరోడ్డ సెంటర్‌లో నుంచి వస్తున్న నాకు ఓ వ్యక్తి బండి ఆపాడు... అయ్యా గడియార స్థంబం సెంటర్ వరకు వదలయ్యేంది.. అంటూ వేడుకున్నాడు. సరే అని బండి ఎక్కించుకొని వస్తున్న సమయంలో తాను భవన నిర్మాణ కార్మికుడని చెప్పుకొచ్చాడు. తనది ప్రకాశం జిల్లా యనమదల అన్ని, చిన్న తనం నుంచి, ఇప్పటివరకు చిలకలూరిపేటే తనకు తిండి పెడుతుందన్నాడు. గతంలో ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకొనే వాడినని ఇప్పుడు ఏ రోజు పని ఉంటుందో, లేదో తెలియటం లేదన్నాడు. గడియార స్థంబం దగ్గర నిలుచుంటే ఎవరో ఒకరు భోజనం ప్యాకెట్లు ఇస్తున్నారని, ఇలా పది రోజుల నుంచి ఇలాగే తింటున్నాని తెలిపాడు. పేట ప్రజలు మనస్సు ఉన్నవారిని, అప్పటికి ఇప్పటికీ చిలకలూరిపేటే తనకు తిండి పెడుతుందని కృతజ్ఞత వ్యక్తం చేశాడు. ఈ ఒక్క సంఘటన చాలదా పేట ప్రజల మనసతత్వం,వారి ఔదార్యం ఏమిటో భోధపడటానికి...
ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేతులు మిన్నా...అవును నిజమే. ఇప్పుడు చిలకలూరిపేటలో సాయం చేయటానికి ముందుకు వస్తూ ఆపన్నులకు తామున్నామని ముందుకు వస్తున్నతీరు, జరుగుతున్న సేవా కార్యక్రమాలు, అభినందనీయం. లాక్‌డౌన్ పేదల జీవితాల్లో చీకట్లు నింపింది. పనిలేక, జేబుల్లో చిల్లిగవ్వ లేక, పస్తులతో పిల్లలకు సైతం తిండి అందించలేని పరిస్థితిలో వీరికి అనేక మంది బాసటగా నిలిచారు.
ప్రభుత్వ పరమైన సహాయం ఒకవైపు అందుతున్నా, కనీసం రేషన్‌కార్డులులేక, నిలవనీడ లేని వారు చిలకలూరిపేట నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నారు. యాచకులకు, వలస కార్మికులకు పేట ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. చివరకు టాన్స్‌జండర్లు సైతం తమ పరిధిలో సహాయం చేయటానికి ముందుకు వచ్చారంటే ఆయా వర్గాల ప్రజల త్యాగనిరితికి నిదర్శనం.వీరంతా ఏదో ప్రచారంకోసమో, మరే ప్రాపకాండ కోసమో సహాయం చేయటం లేదు. తాము చేయాల్సిన పనిని నిశ్చబ్దంగా చేసుకుపోతున్నారు.
కష్టాలు కలకాలం ఉండవు. చీకటి పక్కనే వెలుగు ఉంటుంది. ఆ వెలుగు చూడాలంటే కొంతమంది అపన్నహస్తం అందించాలి. అటువంటి ఆసరా అందించి భాసటగా నిలుస్తున్న వారందరికి అభినందనలు తెలుపుకుంటూ....



Post A Comment:
0 comments: