చిలకలూరిపేటలో మద్యం మందుబాబులకు చుక్కలు చూపెడుతోంది. లాక్‌డౌన్ అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. లిక్కర్ విక్రయాలు నిలిపివేసిన సమయంలో కొందరు మద్యం దుకాణాల సిబ్బంది, కాస్తంత పలుకుబడి కలిగిన వ్యక్తులు కుమ్మక్కై రెచ్చిపోయి భారీ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్ లభించిన తర్వాత అక్రమ వ్యాపారం కట్టలు తెంచుకుంది. డిమాండ్ ఉన్న మద్యం బాటిళ్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పేటలో మద్యం దుకాణాల్లో సిబ్బంది వ్యవహారం ఇష్టారాజ్యంగా మారిపోయింది.
మద్యం విక్రయాల్లో అవినీతి గుప్పుమంటోంది. కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమ విక్రయాలకు తెరతీశారు. డిమాండ్ ఉన్న బ్రాండ్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోవడం ఎక్కువైంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)లో అధికారులు సైతం చూసిచూడకుండా వదలివేయంతో అక్రమ వ్యాపారం జోరందుకుంది.
మద్యం దుకాణాల్లో డిమాండ్ ఉన్న బ్రాండ్లు మాయం
నూతన మద్యం విధానంలో పాత బ్రాండ్లు లేవు. ఉన్నవి కూడా కొన్నే. వాటిలో కొన్ని బ్రాండ్లకు బాగా డిమాండ్ ఉంది. ఇదే అదనుగా దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆ బ్రాండ్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. దుకాణాలకు చేరకుండానే కేస్‌లు బయటకు వెళుతున్నాయి. తప్పనిసరి పరిస్థితిలో దుకాణాల్లో ఎప్పుడూ వినని బ్రాండ్ల మద్యం కొనుగోలు చేస్తున్నామని మందుబాబులు అంటున్నారు.
ఒకవైపు లారీల కొద్ది మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నా, తెలంగాణా మద్యం చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్యక్షమౌవుతునే ఉంది. అన్ని రకాల బ్రాండ్ల మద్యం లభ్యం కావటం, ఏపీ మద్యానికి, తెలంగాణా మద్యానికి ధర విషయంలో భారీ వ్యతాసం ఉండటంతో అక్రమ మద్యవిక్రయాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఒక సారి పట్టుబడిన వ్యక్తులు తిరిగి బయటకు వచ్చి ఇదే వ్యాపారాన్ని కొనసాగించటం విశేషం. మరోవైపు మద్యం దుకాణాల్లో ఉన్న సిబ్బంది వల్ల బెల్టుషాపులు తిరిగి తెరమీదకు వచ్చాయన్న విమర్శలు ఉన్నాయి. చిలకలూరిపేట మద్యం విక్రయాలు, అక్రమ రవాణాపై చర్యలు తీసుకోకుంటే మద్యం మాఫీయా విజృంభించే ప్రమాదం పొంచి ఉందన్నది వాస్తవం.

Post A Comment:
0 comments: