17న కొల్లా వెంకయ్య వర్ధంతి సందర్బంగా ....
ఒకరి జీవితం మరోకరికి స్పూర్తినిస్తుంది. ఎన్నడో మనల్ని వదలి వెళ్లిన ఒక వ్యక్తిని స్మరించుకోవటమంటే ఆయన స్ఫూర్తితో ప్రజలకు దగ్గరకావటమే. ప్రజానాయకుడు, విప్లవ యోధుడు, మాజీ ఎంపీ కొల్లా వెంకయ్యను ఇలా స్మరించుకోవటమంటే నాటి పోరాటాల ఉద్వేగ కాలంలోకి తొంగి చూడటమే. అవును అయన జీవితమే పోరాటాల చరిత్ర. చివరి వరకు ప్రజలకోసం ,వారి అభ్యున్నతికోసం గడిపిన మహోన్నత శక్తి అతను. ప్రజలను దుర్భర దారిద్య్రంలోకి ఈడుస్తున్న భూస్వామ్య దోపిడీ లేని రాజ్యాన్ని, దేశ ఆర్థిక జీవనాడులను పీల్చి పిప్పిచేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీ లేని సమసమాజాన్ని ఆవిష్కరించాలని కొల్లా వెంకయ్య ఆకాంక్షించారు. దశాబ్దాల సుదీర్ఘ విప్లవ ప్రయాణంలో ఎనలేని అనుభవాలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, తవ్వి తీసిన గుణపాఠాలు ఎన్నో. ఈనెల 17వ తేదీ అయన వర్దంతి. ఈ సందర్బంగా ఆయనను ఒక్కసారి స్మరించుకుందాం.
పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ ప్రభావంతో జాతీయ ఉద్యమంలో ప్రవేశించిన కొల్లా వెంకయ్య గారు ప్రజల ప్రయోజనాల కోసం జీవితాంతం కృషి చేశారు. కాంగ్రెస్ రాజకీయాలతో అసంతృప్తి చెంది కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ఒకరైనారు. రైతు కూలీ సంఘాలను స్ధాపించి ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగించారు.
స్వతంత్ర పోరాటంలోనూ, రైతుకూలీ పోరాటాలలోనూ, చైనా యుధ సమయంలోనూ, ఎమర్జెన్సీ కాలంలోనూ, శ్రీకాకుళ రైతాంగ సాయుధపోరాట కాలంలోనూ, సుదీర్ఘ కాలం జైలులో నిర్భంధించబడ్డారు. పోలీసుల లాఠీఛార్జీలకు చిత్రహింసలకు గురయ్యారు. కమ్యూనిస్టులను కనిపిస్తే కాల్చే ప్రకాశం ఆర్డినెన్సు కాలంలో నాలుగు సంవత్సరాల అజ్ఞాత జీవితంలో రహస్య జీవితం గడిపారు. ప్రజల ప్రేమాభిమానాలతో ప్రజాపోరాటాలను సాగించారు. నైజాం వ్యతిరేక తెలంగాణా రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా వున్నారు.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా1948 సం. నుండి 1964 సం. వరకు కొద్దికాలం మినహా, పని చేశారు. ఆ కాలంలోనే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రొంపేరు బంజరు భూముల పోరాటం సాగించి పేదప్రజలు భూమిని సాధించుకున్నారు. నాగార్జునపాగర్ ప్రాజెక్టుకోసం , అప్పాపురం ప్రాజెక్టుకోసం పోరాడి తాగునీటిని, సాగు నీటిని సాధించుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిన తర్వాత మార్క్సిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా1967 వరకూ కొనసాగారు. కామ్రేడ్ తరిమెలనాగిరెడ్డి, కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి , కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గార్లతో కలిసి మార్క్సిస్ట పార్టీ తో సిధాంత పోరాటం సాగించారు. విప్లవకారుల సమన్వయ కమిటీలో చేరారు. నా పంధా పోరాట పంధా అని శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో భాగమైవారు.
ఎన్నికలలో విజయం సాధించి ప్రధమవ్యవవసాయ మార్కెటింగ్ ఛైర్మన్ అయ్యారు.( 1944 ) పొన్నూరు నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా (MLA 1952) , స్ధానిక సంస్ధల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యునిగా ( MLC 1956), తెనాలి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుని (MP 1962 ) గాఎన్నికైనారు. చట్ట సభలలో ప్రజా వాణిని వినిపించారు. విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్లమెంటు సభ్యత్వానికి కామ్రేడ్ మాదల నారాయణస్వామి గారితో పాటుగా రాజీనామా చేశారు.
ప్రజా సంస్క్రతి లో ప్రజాకవి వేమన పాత్ర పై పుస్తకం రాశారు. కులం పునాదులపై , భూసంస్కరణలపైనా, కమ్యూనిస్టు విభేధాలపైనా వ్యాసాలు రాశారు. ఎర్రజెండా—ముందుబాట ప పత్రికలకుఎడిటర్ గా పనిచేశారు.పేద ప్రజల భూమికోసం, భూసంస్కరణల అమలు కోసం సభలు, సమావేశాలు, వ్యాసాలు, సదస్సులు, పాదయాత్రలు, సత్యాగ్రహాలు, శాసనసభలో ప్రసంగాలు, వాకౌట్ లు, ప్రైవేటు బిల్లులు, సుప్రీంకోర్టులో కేసుల నుండి సాయుధ పోరాటం వరకూ అన్ని పోరాట రూపాలను రూపొందించి, ఆచరించి పోరాటశక్తులలో ఒకరై చివరికంటా నిలిచారు.
చివరిగా, నల్లమడ రైతుసంఘాన్ని స్ధాపించి నల్లమడ వరదల శాస్విత పరిష్కారం కోసం మహోద్యమాన్ని నిర్మించారు. ప్రతికూల పరిస్ధితులలోకూడా రైతులనందరినీ ఐక్యంచేశారు. 80 వరద పీడిత గ్రామాలలో కాలి నడకన తిరిగారు. నల్లమడ రొంపేరు ప్రాంతంలో రైళ్ళతో సహా పూర్తి బంద్ ను జరిపి ప్రభుత్వ మెడలువంచి వరదల నివారణకు నిధులను సాధించారు, నల్లమడ రైతు ఉద్యమం రైతుల ఐక్యతకు , రైతు ఉద్యమాలకు ఉదాహరణగా నిలిచింది.
జీవితాంతం ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడికి పెదనందిపాడు ప్రాంత ప్రజలు తమ గుండెల్లో పదిలమైన స్థానాన్ని కల్పించారు. పెదనందిపాడు సెంటర్ లో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. నర్సాయపాలెం ప్రజలు చందాలు వసూలు చేసి కామ్రేడ్ కొల్లా వెంకయ్య విజ్ఞాన్ భవన్ ని నర్సాయపాలెం సెంటర్లో నిర్మంచి విజయవంతంగా విర్వహిస్తున్నారు. కొల్లా వెంకయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రజాపోరాటాల్లో నిమగ్నమైన ఆయన కుమారుడు, నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు, కొల్లా వెంకయ్య మనవుడు డాక్టర్ కొల్లా అమర్,కుటుంబ సభ్యులు పెదనందిపాడులో కామ్రేడ్ కొల్లా వెంకయ్య మెమోరియల్ లైబ్రరీని స్ధాపించి నిర్విఘ్నంగా నడుపుతున్నారు. ప్రతి ఏటా కొల్లా వెంకయ్య స్మరించుంటూ అనేక సాంస్క్రతిక, క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
ప్రజాయుద్ధ వైతాళికునిగా, ఒక నూతన సమాజాన్ని, దేశాన్ని స్వప్నించి, దానికై కృషిచేసిన విప్లవనేత కొల్లా వెంకయ్య వర్ధంతి సందర్భంగా వినమ్రంగా అరుణారుణ జోహార్లు అర్పిస్తూ

Post A Comment:
0 comments: