స్వాతంత్ర్యమే మా జన్మహక్కని ...
నాటి స్వతంత్ర్య పోరాటాలకు హారతి పట్టిన చరిత్ర పుస్తకం
జనవరి 26న ఆవిష్కరణకు సిద్దం
ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం .. అంటారు మహాకవి శ్రీశ్రీ. ఆయన మాటలను నిజం చేస్తూ మన మధ్య సామాన్యుల్లా బతికిన వ్యక్తులు నాటి స్వాతంత్ర్య పోరాటంలో అసామాన్యులన్న విషయం ఎందరికి తెలుసు. బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వారి దేశభక్తినీ చరిత్ర విస్మరించింది. లొంగిపోవడానికి, సాగిలపడటానికి అంగీకరించనివారి తిరుగుబాటు తత్వం స్ఫూర్తిదాయకం. కానీ అటువంటి వ్యక్తులకు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రరచనలో తగిన అధ్యాయం సమకూరలేదు. ఈ లోటును భర్తి చేయటానికి పూను కున్నారు చరిత్ర అధ్యాపకులు, రిటైర్ట్ ప్రిన్సిపాల్ తోటకూర వెంకటనారారాయణ. స్వాంతంత్ర్యమే మా జన్మహక్కుని ..గుంటూరు జిల్లా పోరాటయోధుల శంఖారావం పేరుతో పుస్తకాన్ని రచించారు. చరిత్ర పుటల్లో కనిపించని పోరాట యోధుల జీవితాన్ని గ్రంధస్థం చేశారు. ఈ పుస్తకం జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆవిష్కరణకు నోచుకోనుంది.
అలనాటి పల్లె పోరాటాలకు అక్షర రూపం....
చరిత్ర రచనలో పల్లె పోరాటాలు విస్మరించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 101 మంది స్వాతంత్ర్య పోరాట యోధులు ఉన్నారన్న నిజం తోటకూర వెంకటనారాయణ పుస్తకం ద్వారా బయటకు రానుంది. తెలుగునాట గత వందేళ్ళకాలంలో వెల్లువెత్తిన పోరాటాలు, విప్లవాలు అనేకం. వాటిని ఒక పద్ధతిగా నమోదు చేసిన దాఖలాలు లేవు. మన పల్లెల్లో మనవాళ్ళు చేసిన పోరాటాలు కాగితాల మీద కెక్కాలి. వారి పోరాటాలకు హారతి పట్టిన చరిత్ర కనిపించదు. ఈ కోవలో తోటకూర వెంకటనారాయణ స్వతహాగా చరిత్ర అధ్యాపకుడు కావటంతో ఎక్కడ తప్పు జరిగిందో కనిపెట్టారు. ఈ తప్పును సరిదిద్దటానికి గుంటూరు జిల్లా స్వాంతంత్ర్య యోధుల జీవితాలను చరిత్రగా మలచటానికి పుస్తక రచన చేశారు.
తోటకూర వెంకటనారాయణ సీఆర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకు డిగా, ప్రిన్సిపల్ గా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందారు. చాలానుంది. ఉద్యోగ విర మణ అనగానే విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరికింద సుకుంటారు. కానీ తోటకూర తన సాహిత్య వ్యాసంగానికి మంది సమయం దొరికిందని ఆనందపడ్డారు. రిటైరయిన తర్వాత తనకు ఇష్టమైన కవిత్వం, చరిత్ర రచన ద్వారా జీవిత సత్యాలు చెబు తున్నారు. ఈ క్రమంలోనే పితృదేవోభవ, గుర్తుకొస్తున్నాయి. స్మైలీ ,జడకుప్పెలు, రైతు కోసం అనే కవితా సంకలాలులతో పాటు స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలను వివరిస్తూ స్వాతంత్ర్యం కోసం.. అనే పుస్త కాన్ని వెలవ రించారు.తాను పుట్టి పెరిగిన గ్రామ చరిత్ర కష్టనష్టాలకు ఓర్చి సంతరావూరు కథలు, మా ఊరు సంతరావూరు పేరుతో ఆ ఊరి గొప్పతనాన్ని, మారిన గ్రామ పరిస్థితులను వివరిస్తూ పుస్తకాన్ని రచించారు. ఈ క్రమంలోనే ఆయన అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 101 మంది స్వాతంత్ర్య యోధుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు.
గుంటూరు జిల్లా రాజకీయంగా చైతన్యం కల జిల్లా. ప్రపంచంలో జరిగిన ప్రతి పోరాటం, వాటి పరిణమాలు సహజంగా జిల్లా వాసులపై పడ్డాయి.ఈ జిల్లాలో అలనాటి స్వాతంత్ర్య సమరంలో గాంధీజీతో కలిసి అడుగేసిన పోరాట యోధులు ఉన్నారు. కమ్యునిజంతో జతకట్టి తమ తమ రీతిలో పోరాటాలు సాగించిన మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వారి త్యాగాలు,వారి జ్ఞాపకాలు తడిమే ప్రయత్నం చేశారు తోటకూర వెంకటనారాయణ. పలనాటి పుల్లరి ఉద్యమం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, కోటప్పకొండ ఉద్యమం, చీరాల-పేరాల ఉద్యమాలు, వాటితో మమైకమైన నాటి నాయకుల త్యాగాలను ఈ పుస్తకంలో వివరించారు. వీటితో పాటు అలనాటి శాస్త్రియ సోషలిస్టు భావజాల వ్యాప్తి, మంతెనపాలెం, కొత్తపట్నం, నిడబ్రోలులో జరిగిన రాజకీయ పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, సహపంక్తి భోజనం, వితంతు వివాహాలు, మరెన్నో సాంఘిక సంస్కర్ణలు ప్రజల్లో తెచ్చిన మార్పులను గ్రంధస్థం చేశారు. ఆయనే ముందుమాటలో చెప్పుకున్నట్లు ఆలనాటి మహనీయుల, పోరాట యోధుల త్యాగాలకు చరిత్రలో సముచిత స్థానం లభించలేదని, అందుకే పుస్తక రచనకు పూనుకున్నట్లు వెల్లడించారు.
చరిత్ర నిర్మాణానికి చోదకశక్తులు ప్రజలే. ఆ ప్రజల చరిత్ర మాత్రం సక్రమంగా, సరయినవిధంగా రికార్డు కావడం లేదన్నది రచయిత భావించాడు. గుంటూరు జిల్లా అడుగడుగునా ప్రతి పల్లెలో అనేక చారిత్రక గాథలున్నాయి. తిరుగుబాటు స్వరాల గర్జనలున్నాయి. వాటిని స్మరించుకోవడం, రికార్డు చేయడమంటే చరిత్రకు దివిటీలు పట్టడం. తద్వారా వర్తమానాన్ని మరింత జాగృతం చేయడం. లొంగని తరానికి రూపుదిద్దడం. వెరపు నెరుగని యువచైతన్యాన్ని ప్రోది చేయడం. కనుకనే చరిత్ర రచన ఒక బాధ్యతగా తీసుకొన్న తోటకూర అనేకమంది పోరాట యోధుల జీవితాలను సృజించారు. ఆయన పుస్తకంలో పేరు ప్రఖ్యాతులు గావించిన కాసు బ్రహ్మానందరెడ్డి,కన్నెంటి హనుమంతు, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొల్లా వెంకయ్య, టంగుటూరి ప్రకాశం, ఎన్‌జీ రంగా, వావిలాల గోపాలకృష్ణ, మోటూరి హనుమంతరావు, తుమ్మల సీతారామచౌదరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, పర్వతనేని వీరయ్య చౌదరి, మద్ది సుదర్శనం, షేక్ అబ్దుల్ వహాబ్, మహమ్మద్ హనీఫ్ ఇలా 101 మంది జీవిత చరిత్రలను పొందుపరిచారు. మరో విషయమేమిటంటే ఈ పుస్తకంలో 25 మందికి పైగా కమ్యునిస్టు నాయకుల చరిత్ర ఉండటం.
పుస్తకరచనలో తోటకూర వెంకటనారాయణ భాష విషయంలో సరళమైన వచన శైలీని, చిన్నపిల్లలకు సైతం అర్ధమయ్యే విధంగా రాయటం విశేషం. అలనాటి వ్యక్తుల జీవితం గురించి రాయటమంటే నాటి చరిత్రను ఒడిసిపట్టుకోవటమే. రచయిత ఇదే పద్దతిని అనుసరించారు. యధావిధిగా గుంటూరు జిల్లా రాసినట్లైయితే ఈ పుస్తకం అంతగా ఇష్టపడరేమో. అన్ని గ్రంధాల మాదిరి పుస్తకాల అలమరాలో ఒక మూలన పడి ఉండేది. కాని రచన శైలీలో జీవితాలను చిత్రికరించి , చరిత్రను వెలికి తీసారు. కథనంగా సాగే రచన నాటి ఉద్యమాలను కళ్లకు కట్టినట్లు కనించింది. దీంతో పుస్తకం ప్రారంభం నుంచి చివరి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది. తన అక్షరాల్ని పదునెక్కిన ఆయుధాలుగా మలిచి, మనకు చరిత్రని గుంటూరు జిల్లా చరిత్రను, చరిత్రను సృష్టించిన పోరాట యోధుల జీవితాలను అందించటం అభినందనీయం.
-----------------------------------------



Post A Comment:
0 comments: