చిలకలూరిపేట:
ప్రతి సారి ప్లాస్టిక్ నిషేదం, పాలిథిన్ కవర్లు వాడితే చర్యలు అంటూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పటం, తిరిగి అంతా మామూలుగానే జరిగిపోవటం జరుగుతున్న తంతే. నియోజకవర్గంలో ప్రతి మనిషి సగటున నాలుగు కేజీల పాలిథిన్ కవర్లు వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది .క్యారీ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, టీ కప్పులు ఇవన్నీ కలసి చిలకలూరిపేట మున్సిపాలిటి నుంచి వ్యర్ధాల్లో ఐదు శాతానికి మించి ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటున్నాయి.
పాలిథిన్ వాడకం పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, అది క్యాన్సర్ కారణమని తెలిసినా, ప్లాస్టిక్ కవర్ నిషేధించటం లేదు. ప్రతి ఒక్కరూ కిరాణ, కూరగాయల, వివిధ రకాల కు ప్లాస్టిక్ కవర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ప్లాస్టిక్ వ్యాపారులు రూ.కోట్ల దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని అదుపుచేయాల్సిన అధికారులు చూసి చూడ కుండా వదిలివేయటంతో ప్లాస్టిక్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలతో జరిగే నష్టాలు ఇవే..
ప్లాస్టిక్ వినియోగంతో వాతావరణ కాలుష్యంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలవల్ల భూమిని కాపాడే ఓజోన్ పొరకు భారీస్ధాయిలో చిల్లు పడుతుంది. దీని వల్ల భూమి పైన ఉన్న జీవరాశులు, మనుషుల్లో శ్వాస, చర్మ, సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. అంతేగాక గరం గరం చాయ్.. వేడి వేడి ఇడ్లీ, దోశ, పూరి లాంటివి ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకొచ్చి తింటాము. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టలను పట్టించుకోరూ. అంతేగాక పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ప్లాస్టిక్ అడ్డుకుంటుంది. ప్లాస్టిక్‌ను తగలబెట్టడం వల్ల డ్రైయాక్సిన్ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్ కారణమవుతుంది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటాయి. వాటి మాంసం మనం తినటం వల్ల పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతాయి.
విస్తృత ప్రచారమే మార్గం...
పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటేనే మంచిది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని బాధ్యతగా గుర్తించాలి. కవర్లు, కప్పులు, వాటర్ బాటిళ్లు బహిరంగా ప్రదేశాల్లో వేయరాదు. ప్రజలు ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అధికారులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి.

.jpg)
Post A Comment:
0 comments: